
సాధ్యమైనంత వరకు దేశీయ వస్తువులనే వాడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
నాగ్‌పూర్: దేశం యావత్తూ మహమ్మారి కరోనాతో పోడుతుంటే ప్రజల్ని రెచ్చగొట్టేందుకు కొందరు సిద్ధంగా ఉంటారని, పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని భారత ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అలాంటివారిపట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి వివక్షా లేకుండా బాధితులందరికీ సహాయం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులను కోరారు. అదేవిధంగా దేశం స్వావలంబన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని నొక్కి చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆయన నాగ్‌పూర్ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవకులను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో తన సందేశం వినిపించారు.
(చదవండి: ఆ రైలు అదే.. కిమ్ అక్కడే ఉండొచ్చు!)
దేశంలో ఉన్న 130 కోట్ల మంది భరతమాత బిడ్డలేనని ఆయన పేర్కొన్నారు. ఎవరూ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. భరతమాతను ముక్కలు చేస్తున్నామంటూ కొందరు ప్రజలను రెచ్చగొట్టే పనులు చేస్తారని, వాటిల్లో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంటుందని అన్నారు. ఎవరో కొందరు వ్యక్తులు చేసే తప్పిదాలకు మొత్తం సమాజాన్నే నిందించడం మంచిది కాదని తబ్లిగీ ప్రార్థనలను ఉద్దేశించి మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. సాధ్యమైనంత వరకు దేశీయ వస్తువులనే వాడాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారని చెప్పారు.
(చదవండి: బుసలు కొడుతున్న కరోనా)