పీసీబీ వర్సెస్ జలమండలి
► మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణంలో జాప్యం
► నిధులివ్వడం లేదని పీసీబీపై జలమండలి ఫిర్యాదు
► రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ..
సాక్షి, సిటీబ్యూరో: జలాశయాల చుట్టూ ఎస్టీపీల (మురుగు శుద్ధి కేంద్రాలు) నిర్మాణం విషయంలో జలమండలికి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మధ్య సమన్వయ లోపం తలెత్తింది. చివరకు ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు చేరుకుంది. ఎస్టీపీల నిర్మాణానికి నిధుల విడుదల చేయడంలో పీసీబీ జాప్యం చేస్తోందని జలమండలి ఆరోపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే...గ్రేటర్ వరదాయినిలు ఉస్మాన్‌సాగర్(గండిపేట్), హిమాయత్‌సాగర్ జలాశయాలు కాలుష్య కాసారాలు కాకుండా కాపాడేందుకు పలుచోట్ల ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించారు.
ఈమేరకు పీసీబీ రూ.13 కోట్లు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అయితే మొదట నిధుల విడుదలకు అంగీకరించి, తర్వాత పీసీబీ వెనక్కి తగ్గినట్లు తెలియడంతో ఈ అంశంపై జలమండలి అధికారులు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని లేఖ రాశారు. ఈ వ్యవహారంపై త్వరలో సీఎస్ సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగితేనే ఈ పంచాయతీకి ఫుల్స్టాప్ పడనున్నట్లు సమాచారం.
మురుగు శుద్ధి కేంద్రాలు ఎందుకంటే..
జంట జలాశయాలకు కాలుష్య విషం నుంచి విముక్తి కల్పించేందుకు 11 గ్రామాల పరిధిలో మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)లను నిర్మించాలని ఏడాది క్రితం జలమండలి సంకల్పించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించాలని ప్రతిపాదించింది. ఉస్మాన్‌సాగర్(గండిపేట్)కు ఆనుకొని ఉన్న ఖానాపూర్,వట్టినాగులపల్లి, జన్వాడ, అప్పోజిగూడా, చిలుకూరు, బాలాజీ దేవాలయం, హిమాయత్‌నగర్ గ్రామాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక హిమాయత్‌సాగర్ పరిధిలో హిమాయత్‌సాగర్, అజీజ్‌నగర్, ఫిరంగినాలా, కొత్వాల్‌గూడా పరిధిలో ఎస్టీపీలు నిర్మించాలని తలపెట్టింది.
వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను పీబీఎస్ సంస్థ సిద్ధంచేసింది. వీటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూ.13 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ రూ.27.50 కోట్లు వ్యయం చేయాలని గతంలో నిర్ణయించారు. వీటి నిర్మాణం, నిర్వహణ పనులను జలమండలి పర్యవేక్షించనుంది. ఆయా గ్రామాల నుంచి రోజువారీగా వెలువడే వ్యర్థజలాలను మురుగు శుద్ధి కేంద్రాలకు తరలిస్తారు. రోజువారీగా ఇక్కడికి వచ్చే గృహ, పారిశ్రామిక, వాణిజ్య వ్యర్థజలాలను శుద్ధిచేసిన అనంతరం స్థానికంగా ఆయా గ్రామాల పరిధిలో గార్డెనింగ్, వనసంరక్షణకు వినియోగించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
ఇన్‌ఫ్లో చానల్స్‌నూ ప్రక్షాళన చేయాల్సిందే..!
జంటజలాశయాల ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల పరిధినుంచి జలాశయాలకు వరదనీటిని చేర్చే కాల్వలు(ఇన్ఫ్లోఛానల్స్)కబ్జాకు గురవడం,ఇటుకబట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌజ్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో జలాశయాలు రోజురోజుకూ చిన్నబోతున్నాయి. ప్రస్తుతం ఈ జలాశయాలు చుక్క నీరు లేక చిన్నబోయి కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆయా ఇన్‌ఫ్లో చానల్స్‌ను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.
ఎస్టీపీలు నిర్మించాల్సిన గ్రామాలు..వాటి సామర్థ్యం ఇలా...
♦ ఉస్మాన్‌సాగర్(గండిపేట్ జలాశయం పరిధిలో)
ఖానాపూర్–0.6 మిలియన్ లీటర్లు
వట్టినాగులపల్లి–0.8 మిలియన్ లీటర్లు
జన్వాడ–0.6 మిలియన్ లీటర్లు
అప్పోజిగూడా–0.1 మిలియన్ లీటర్లు
చిలుకూరు–0.7 మిలియన్ లీటర్లు
బాలాజీ దేవాలయం–0.1 మిలియన్ లీటర్లు
హిమాయత్‌నగర్–0.3 మిలియన్ లీటర్లు
♦హిమాయత్‌సాగర్ పరిధిలో...
హిమాయత్‌సాగర్–0.25 మిలియన్ లీటర్లు
అజీజ్‌నగర్–0.9 మిలియన్ లీటర్లు
ఫిరంగినాలా–2.9 మిలియన్ లీటర్లు
కొత్వాల్‌గూడా–0.3 మిలియన్ లీటర్లు