మధ్యతరహా జలాశయాలకు జలకళ
రామప్ప, మల్లూరుకు పెరుగుతున్న వరద
మత్తడి పడుతున్న లక్నవరం
ఏటూరునాగారంలో అత్యధికంగా వర్షపాతం
వరంగల్ : జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టులన్నీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలకళను సంతరించుకున్నాయి. గత సంవత్సరం నీరు లేక వెలవెలబోయిన జలాశయాలు ఇప్పుడు నిండుకుండలా మారాయి. లక్నవరం చెరువు పూర్తి స్థామర్థ్యం 34.4 అడుగులు. కొత్తగూడ, నర్సంపేట, ములుగు ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో సుమారు 36సెంటీ మీటర్ల భారీ వర్షాలతో లక్నవరం చెరువు నిండిపోయి గరిష్ట నీటి మట్టానికి చేరుకోవడంతో ఈనెల 3వ తేదీ నుంచి మత్తడి పోస్తోంది. లక్నవరం అందాలు తిలకించేందుకు వస్తున్న సందర్శకులకు మత్తడి పడడం అదనపు ఆకర్షణగా తయారైంది. గత నెల వరకు నీరు లేక వెలవెల పోయిన పాకాలకు ఇప్పుడు మెల్లమెల్లగా జలకళ వస్తోంది. పాకా ల చెరువు గరిష్ట నీటి మట్టం 30.3 అడుగులు కాగా 4వ తేదీ నాటికి నీటిమట్టం 21అడుగులకు చేరుకుంది. ఈ వర్షాలు మరో వారం రోజులు పడితే పాకాల మత్తడి పోసే అవకాశాలున్నట్లు నీటిపారుదల శాఖ అ«ధికారులు తెలిపారు. రామప్ప చెరువు గరిష్ట నీటి మట్టం 35ఫీట్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 16అడుగులకు చేరుకుంది. రామప్ప పరివాహక ప్రాం తాల్లో భారీ వర్షాలు లేక పోవడం వల్ల పూర్తి స్థాయిలో వరద రాకపోవడం వల్ల చెరువు నిండలేదు. ప్రస్తుత వర్షాలు ఇలాగే కొనసాగితే పూర్తి స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. జిల్లాలోని నాలుగు మధ్య తరహా ప్రాజెక్టుల నీటి మట్టాలు గురువారం సాయంత్రం వరకు ఇలా ఉన్నాయి.
జిల్లాలో మండలాల్లో గడిచిన నాలుగు
రోజుల్లో నమోదైన వర్షపాతం వివరాలు..
చేర్యాల 13.8మి.మీ., మద్దూరు 14.8, నర్మెట 23.4, బచ్చన్నపేట 19.4, జనగామ 9.4, లింగాలఘనపురం 7, రఘునాథపల్లి 18.2, స్టేషన్‌ఘన్‌పూర్ 31.4, ధర్మసాగర్ 55.4, హసన్‌పర్తి 74.4, హన్మకొండ 64.8, వర్ధన్నపేట 26.4, జఫర్‌గఢ్ 20.2, పాలకుర్తి 16.4, దేవరుప్పుల 6, కొడకండ్ల 10, రాయపర్తి 21.8, తొర్రూరు 23.8, నెల్లికుదురు 16.6, నర్సింహులపేట 5.4, మరిపెడ 32.4, డోర్నకల్ 15.8, కురవి 93.2, మహబూబాబాద్ 24.8, కేసముద్రం 31.6, నెక్కొండ 46.8, గూడూరు 61.6, కొత్తగూడ 78.4, ఖానాపూరం 67, నర్సంపేట 61.4, చెన్నారావుపేట 43.4, పర్వతగిరి 25.4, సంగెం 41.2, నల్లబెల్లి 47.8, దుగ్గొండి 62.4, గీసుకొండ 65.6, ఆత్మకూరు 74.6, శాయంపేట 89, పరకాల 68.4, రేగొండ 79.4, మొగుళ్లపల్లి 71.2, చిట్యాల 65.4, భూపాలపల్లి 77.6, గణపురం 81.4, ములుగు 82.4, వెంకటాపూరం 60.4, గోవిందరావుపేట 96, తాడ్వాయి 97.2, ఏటూర్‌నాగారం 117, మంగపేట 104, వరంగల్ 58.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.