ఇదిగో.. విమానాన్ని నడపగల రోబో..
- బోయింగ్ సిములేటర్‌ను విజయవంతంగా నడిపి, సేఫ్‌గా ల్యాండ్ చేసిన రోబోట్
- అరోరా ఫ్లైట్ సైన్సెస్-అమెరికన్ ఆర్మీ సంయుక్త పరీక్ష విజయవంతం
మానసాస్: విమానయాన చరిత్రలో అద్భుతాలు ఆవిష్కతమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. ఇప్పటికే ఎన్నెన్నో పనులు చేస్తోన్న రోబోలు విమానాలను నడపగలిగే సామర్థ్యాన్నికూడా సొంతం చేసుకున్నాయి. శాస్త్రవేత్తలు అభివృద్ధిచేసిన అలియాస్ అనే రోబో.. భారీ బోయింగ్ ఫ్లైట్ సిములేటర్(అనుకరణ యంత్రం)ను నడపడమేకాదు, సురక్షితంగా ల్యాండ్ చేసింది కూడా!
రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా ప్రఖ్యాత అరోరా ఫ్లైట్ సైన్సెస్ సంస్థ, అమెరికన్ ఆర్మీ సంయుక్తంగా వర్జీనియాలో నిర్వహించిన పరీక్షలు విజయవంతం అయ్యాయి. సిములైటర్లో రోబోట్ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన విషయాన్ని అరోరా సంస్థ ప్రతినిధులు బుధవారం ప్రపంచ మీడియాకు వెల్లడించారు.
అలియాస్(ALIAS-- Aircrew Labour In-Cockpit Automation System)గా వ్యవహరించే రొబోటిక్ వ్యవస్థపై అరోరా సంస్థ గత కొన్నేళ్లుగా పరిశోధనలు నిర్వహిస్తోంది. ఆమేరకు అవసరమయ్యే నిధులను అమెరికన్ రక్షణ శాఖ అందిస్తోంది. అలెక్సా వాయిస్ కమాండ్ మాదిరిగా శబ్ధరూపంలోని ఆదేశాలను గుర్తించడం, స్పీచ్ సింథసిస్ విధానంలో మాట్లాడుతూ పైటల్, కమాండ్ కంట్రోల్ సెంటర్లతో సంభాషణలు సాగించడం, పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం, విజువల్ ఇన్‌పుట్స్‌ను స్వీకరించడం తదితర పనులెన్నింటినో అలియాస్ చేయగలదని అరోరా సంస్థ ప్రతినిధి జాన్ విస్లర్ తెలిపారు.
కొద్ది నెలల కిందటే సెన్సా 208, డీహెచ్సీ-2 అనే తేలికపాటి విమానాలను అనుకరణ విధానంలో నడిపిన అలియాస్ రొబో.. ఇప్పుడు ఏకంగా భారీ బోయింగ్-737ను విజయవంతంగా (సిములేటర్పై) నడపటం విశేషం. ఈ పరీక్షలు విజయవంతం కావడంతోత్వరలోనే ఈ రోబోలతో నిజం విమానాలను నడిపింపజేయాలని సైంటిస్టులు భావిస్తున్నారు. ఆ పరీక్షలు కూడా సక్సెస్ అయిన పిదప రోబోలు పైలట్ హోదాలో రవాణా, ప్రయాణికుల విమానాలను నడిపిస్తాయనడంలో సందేహంలేదు.