కూలీబిడ్డ ఐఈఎస్
న్యూస్‌లైన్: మీ కుటుంబ నేపథ్యం చెబుతారా..?
జగదీశ్: మాది నిరుపేద కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములం. అమ్మ అంగూరీదేవి, నాన్న రోషన్‌లాల్. నాన్న తుప్పు సామగ్రి సేకరించి విక్రయించేవాడు.(10రోజులక్రితం కాలంచేశారు. విచార వదనాలతో)
న్యూ: మీ విద్యాభ్యాసం గురించి వివరిస్తారా...
జగదీశ్: శాలినీ, నేను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో చదివాం.
న్యూ: ఐఈఎస్ స్థాయికి ఎలా చేరుకోగలిగారు?
జగదీశ్: నాన్న కష్టార్జితంతో బాల్యం గడిచింది. పేదరికంపై స్వీయానుభవమున్న నేను మన దేశంలో పేదల జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు...ఆర్థిక ప్రణాళికా విభాగంలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అత్యున్నత విద్యార్జనకు ఆర్థిక ప్రతిబంధాకలను అధిగమించేందుకు ప్రైవేటులో ట్యూషన్లు చె ప్పాను. ప్రభుత్వ ఉపకార వేతనమూ ఆసరానిచ్చింది.
న్యూ: మీ ఆశయాలేమిటి?
జగదీశ్: దేశంలోని గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులు పరిపుష్టం కావాలి. ప్రణాళికల రచనలోనూ కేంద్ర ప్రభుత్వ నిధుల కేటాయింపులోనూ పేదలకు తగిన ప్రాధాన్యం దక్కేలా ఆయా మంత్రిత్వ శాఖలకు ఉపయోగపపడతాం.
న్యూ: శిక్షణ విశేషాలేంటీ..?
జగదీశ్: మేం ఒకే యూనివర్సిటీలో చదివాం. యా ధృచ్ఛికంగా ఒకే కోర్సును ఎంచుకున్నాం. తద్వారా యూపీఎస్సీలో అర్హత సాధించాం. మాకు 16 నెలల కాలంపాటు శిక్షణ ఉంటుంది. మొదట నాలుగు మాసాల ట్రైనింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికొచ్చాం. తర్వాత ఏడాది ఢిల్లీలోనే తర్ఫీదు ఉంటుంది. ఆపై పోస్టింగులిస్తారు.
న్యూ: రాఘవాపూర్ ఎంపికలో ప్రత్యేకత ఉందా?
జగదీశ్: జిల్లా కేంద్రం నుంచి కనీసం 90 నిమిషాల ప్రయాణం సాగేంతటి దూరాన ఉన్న ఏదేని పల్లెటూరులో అధ్యయనం చేయాలి. అందుకే సంబంధిత అధికారులు రాఘవాపూర్‌కు మమ్మల్ని పంపిం చారు. నాలుగు రోజులపాటు ఇక్కడే ఉండి గ్రామీణ స్థితిగతులను ఆకళింపు చేసుకొంటాం.
న్యూ: యువతకు మీరిచ్చే సలహా/సందేశం?
జగదీశ్: స్థిరమైన ఆలోచనలు, నిబద్ధత ఉండాలి. ప్రతిబంధకాలను దాటుకునేలా పరిస్థితులను అనుకూలింప జేసుకొని ముందుకు సాగాలి. చదువైనా పనైనా శ్రద్ధాసక్తులుండాలి.