బ్యాంకులో రూ.17 లక్షలు దోపిడీ
సివాన్: బిహార్లోని సివాన్ జిల్లాలో దీన్దయాల్ బజార్ వద్ద ఉన్నపంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. మంగళవారం ఉదయం సాయుధులు సుమారు 17లక్షల రూపాయలు దోచుకుని పారిపోయారు.
బ్యాంకులోకి చొరబడిన దొంగలు మొదట నలుగురిపై కాల్పులు జరిపారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు, ఒక కస్టమర్ గాయపడినట్టు ఏఎస్పీ అరవింద్ గుప్తా తెలిపారు. సాయుధుల్లో ఇద్దరు బ్యాంకు బయట కాపలా ఉండగా, మరో నలుగురు దోపిడీకి పాల్పడినట్టు గుప్తా తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ చెప్పారు. ఓ అనుమానితుడిని విచారిస్తున్నట్టు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు పేర్కొన్నారు.