డాక్టర్.. పాప నీవల్లే చనిపోయింది.. రూ.19లక్షలివ్వు
ముంబై: అప్పటివరకు అమ్మకడుపులో ఉండి మరికాసేపట్లో లోకాన్ని చూడాల్సిన ముక్కుపచ్చలారనిబిడ్డ మృతికి కారణమయ్యాడని ఓ వైద్యుడికి ముంబైలోని వినియోగదారుల ఫోరం భారీ ఫైన్ విధించింది. బిడ్డను కోల్పోయిన ఆ మాతృమూర్తికి రూ.19 లక్షల నష్టపరిహార చెల్లించాలని ఆదేశించింది. 2003లో ముంబైలో సోనూ కరీర్ అనే గర్భవతి మాతృశయా అనే ఆస్పత్రికి తరచూ పరీక్షల కోసం వెళ్లేది. కానీ, అదే అక్టోబర్ 18న తీవ్ర నొప్పులతో అదే ఆస్పత్రికి వెళ్లినప్పుడు మాత్రం సదరు వైద్యుడు వెంటనే వెళ్లి మరో ఆస్పత్రిలో చేరాలని చెప్పాడు. అంతేకాకుండా ఏ క్షణంలోనైనా బిడ్డ జన్మించవచ్చని తెలిపాడు.
దీంతో, అక్కడి నుంచి కాందివ్లిలోని మరో ఆస్పత్రికి వెళ్లారు. అయితే, అక్కడి వైద్యుడు నాలుగు గంటలు ఆలస్యంగా రావడమే కాకుండా పరీక్షలు నిర్వహించి మరో పదిహేను నిమిషాల్లో ఆమె డెలివరీ అవుతుందనగా ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో ఆమె డెలివరీ బాధ్యతలు నర్సే చూసింది. అనంతరం వచ్చిన వైద్యుడు పాపను పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పగా.. మార్గ మధ్యలోనే పాప చనిపోయింది. దీంతో బాధితులు వినియోగదారుల ఫోరంను సంప్రదించారు. ఫలితంగా కాందివ్లి వైద్యుడు రూ.19 లక్షలు చెల్లించాల్సిందేనని ఆ ఫోరం ఆదేశించింది. ఆ బిడ్డ చనిపోవడానికి ఆ డాక్టర్ ఆలస్యం, నిర్లక్ష్యం కారణమని స్పష్టం చేసింది.