Rural Governance
-
యువతరం చేతికి గ్రామ నాయకత్వం
సాక్షి, అమరావతి: రెండున్నరేళ్ల తర్వాత గ్రామాల్లో ఏప్రిల్ నుంచి తిరిగి సర్పంచుల పాలన మొదలైంది. 1,30,966 మంది వార్డు సభ్యులుగా, 13,097 మంది సర్పంచులుగా కొత్తగా నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చారు. ఈ ఏడాదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించగా.. 9,675 మంది ఎంపీటీసీలు, 650 జెడ్పీటీసీలు బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర మందికి పైగా కొత్తగా నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చారు. వీరిలో 85 శాతం మంది యువ నాయకత్వమే కావడం గమనార్హం. ఇదే సమయంలో గ్రామీణ పాలనలో ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకొచ్చింది. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా గ్రామాల్లో గ్రామ కంఠంగా వర్గీకరించిన ప్రాంతంలో ఇళ్లకు తొలిసారి అధికారిక యాజమాన్య పత్రాల జారీ ప్రక్రియను చేపట్టింది. గ్రామాల్లో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా జిల్లా పరిషత్లలోనూ రెండో డిప్యూటీ చైర్మన్, మండల పరిషత్‌లలో రెండో ఉపాధ్యక్ష పదవులను కొత్తగా సృష్టించి పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. ఇప్పటికే జెడ్పీలో రెండో డిప్యూటీ చైర్మన్ పదవులకు ఎన్నికలు ముగియగా.. మండలాల్లో రెండో ఉపాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. -
గ్రామీణాభివృద్ధి పాలన.. గాడిలో పడేనా!
అనంతపురం సెంట్రల్ : గ్రామీణాభివృద్ధి శాఖలో పాలన గాడి తప్పింది... ఈ మాట అన్నది ఎవరో తెలుసా.. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కోన శశిధర్. గత నెల 12న డీఆర్డీ ఓ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన మాటల నిజమనేందుకు అనేక నిదర్శనాలు ఆ శాఖలో కనిపిస్తాయి. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు ఆదాయమార్గంగా మలుచుకుంటున్నారు. ఫలితంగా కోట్లు విలువజేసే ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటియాజమాన్య సంస్థ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి కిమిడి వృుణాళిని అధికారులతో మంగళవారం డ్వామా హాలులో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అయినా గాడితప్పిన పాలనను ... మంత్రి గాడిలో పెట్టాలని కోరుతున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా చేపడుతున్న ఇసుకరీచ్‌లలో రూ. కోట్లు విలువైన ఇసుకను అక్రమంగా దారి మల్లించారు. జిల్లాలో ప్రస్తుతం 12 ఇసుక రీచ్‌లు కొనసాగుతున్నా తొలివిడతలో ఏర్పాటు చేసిన మూడు ఇసుకరీచ్‌లు అక్రమాలకు అడ్డాగా మారాయి. ఒక్క ఉల్లికల్లు రీచ్‌లో మాత్రమే రూ. 1.30 కోట్లు విలువైన ఇసుకను దారి మళ్ళించారని నిర్ధారణకు వచ్చారు. ఈ సంఘటనలో స్థానిక ఎపీఎంను సస్పెండ్ చేయగా ఏరియా కో ఆర్డినేటర్ శ్రీనివాసులకు చార్జిమెమోను కలెక్టర్ జారీ చేశారు. ఈ ఘటనలో లోతుగా విచారించి అసలు సూత్రదారులను బయటపెట్టాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం ఆర్డీఓ ఉస్సేన్సాహేబ్ను ఆదేశించారు. అయితే దాదాపు నెలరోజులు గడుస్తున్నా ఆర్డీఓ విచారణ ముందుకు సాగలేదు. ఉల్లికల్లు రీచ్‌లో అధికారులతో పాటు అధికారపార్టీ నాయకుల పాత్ర ఉండడంతో విచారణ ముందుకు పోకుండా ఆర్డీఓపై ఒత్తిడి తెచ్చి వీగిపోయేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు జిల్లాలో ఒక వెలుగు వెలిగిన స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయి. బ్యాంకుల నుంచి అప్పులు పుట్టక... కరువులతో పాత అప్పులు తీర్చలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది రూ. 1150 కోట్లు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం కాగా అతికష్టం మీద ఇప్పటి వరకూ రూ. 190 కోట్లు రుణాలు మంజూరు చేయించగలిగారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వలన బ్యాంకుల వద్ద నమ్మకాన్ని కోల్పోయామని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి డ్వాక్రా సంఘాలకు జవసత్వాలు నింపాలని మహిళలు కోరుతున్నారు. వలసల నివారణే లక్ష్యంగా కరువు జిల్లా అనంత నుంచి పురుడుపోసుకున్న మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అక్కరకు రాకుండా పోతోంది. సక్రమంగా వేతనాలు మంజూరు కాకపోవడంతో ఉపాధి పనులను కాదని బెంగుళూరు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 50 వేల కుటుంబాలకు పైగా జిల్లాను వదిలిపెట్టి వెళ్ళారు. అలాగే 100 రోజుల మాత్రమే పనిదినాలు నిబంధన కూలీలకు ఆశనిపాతంగా మారింది. ఇప్పటికే 25 వేల కుటుంబాలకు వందరోజులు పూర్తికావ డంతో పథకానికి దూరమవుతున్నారు. పథకంపై కూలీలకు భరోసా సన్నగిల్లడంతో 50 వేలకు మించి కూలీలకు పనులకు రావడం లేదు. నిధులు సక్రమంగా మంజూరు కాకపోవడంతో మెట్టభూముల్లో పండ్లతోటల పెంపకం చేపడుతున్న రైతులకు భారంగా మారుతోంది. దీంతో చెట్లను సంరక్షించుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10 వేల ఎకరాలకు పైగా చెట్లు ఎండిపోయాయని డ్వామా అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఆయా శాఖలను గాడిలో పెట్టాలని కోరుతున్నారు.