S. V. Krishna Reddy
-
మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీ.. ఎక్కడ తేడా కొట్టిందంటే!
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోనూ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్ సంగీతమందించారు. (ఇది చదవండి: ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి) అయితే ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలు అందించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది బిగ్‌బాస్ సోహెల్ హీరోగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన చిత్రాలు ఫ్లాఫ్ కావడంపై స్పందించారు. అదే క్రమంలో ఇటీవలే రిలీజైన మహేశ్ బాబు గుంటూరు కారం సక్సెస్ కాకపోవడంపై తనదైన శైలిలో మాట్లాడారు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో.. అక్కడే తేడా కొడుతుందని అన్నారు. అప్పటి టాప్ హీరోల చిత్రమైనా.. గుంటూరు కారం సినిమా అయిన ఇదే జరుగుతుందన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు స్టార్డమ్కు తగినట్లుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ భావించారు. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. కథను బేస్ చేసుకునే సినిమాలు తీయాలి. అంతేకానీ స్టార్‌డమ్‌ను నమ్ముకుంటే అక్కడే తేడా కొడుతుంది. నా సినిమా యమలీల అందుకే పెద్ద హిట్ అయింది. కానీ మిగతా సినిమాలకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.' అని అన్నారు. -
ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి
ఎస్వీ కృష్ణారెడ్ఢి.. పోస్టర్‌పై ఈ పేరు కనిపిస్తే చాలు... ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకి వెళ్లేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతారు. స్వచ్ఛమైన వినోదంతో పాటు మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలకి పెట్టింది పేరు ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు. ఆయన చిత్రాల్లో యమలీల ఓ సంచలనం అయితే మాయలోడు చిత్రం కూడా ఒక సెన్సేషనల్ హిట్.. అలా ఆయన నుంచి ఎన్నో హిట్ చిత్రాలు వెండితెరపై మెరిశాయి. ఒక్కపాటతో 365 రోజులు ఆడిన సినిమా 'మాయలోడు' సినిమాలో 'చినుకు చినుకు సాంగ్' అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ పాటలో బాబూమోహన్- సౌందర్య కలిసి వేసిన స్టెప్పులు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. సుమారు 30 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సాంగ్ వింటూనే ఉన్నాం. ఆ ఒక్క పాట కోసం ఏకంగా 365 రోజులు సినిమా ఆడిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబుమోహన్ చెప్పారు. ప్రేక్షకులు సినిమాకు రావడం ఆ పాట పూర్తికాగానే థియేటర్ నుంచి వెళ్లిపోయేవారని ఆయన చెప్పారు. ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ,సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్.. కానీ ఒక కమెడియన్‌తో సాంగ్ తీయడం ఏంటి..? అనే సందేహం చాలామందిలో ఉండేది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఎస్వీ కృష్ణారెడ్ఢి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. మాయలోడు సినిమాలో హీరోగా ఉన్న రాజేంద్రప్రసాద్ సరైన సహకారం ఇవ్వకపోవడం వల్లే ఆ పాటను బాబూ మోహన్‌తో తెరకెక్కించినట్లు ఆయన ఇలా చెప్పారు. 'మాయలోడు సినిమా పూర్తి కానున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ ఇబ్బంది పెట్టారు. 'నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా.. నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా..' అంటూ నాపట్ల రాజేంద్రప్రసాద్ వెటకారంగా మాట్లాడారు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. సినిమా పూర్తి అవుతుందని అనుకున్న సమయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ తక్కవ కావడంతో అదనపు డేట్స్ కోసం అడిగేతే కనీసం కూడా సహకరించలేదు. ఎలాగైనా పాట చిత్రీకరణ చేయాలని ఆయన్ను బతిమాలుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. ఎలా చేస్తావో చూస్తా అన్నారు ఫైనల్‌గా రాజేంద్ర ప్రసాద్‌తో మిగిలిన డేట్స్ తో డబ్బింగ్ పూర్తి చేయించాను. అది కూడా సినిమాకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలను తన మేనేజర్ చూసిన తర్వాతే డబ్బింగ్ చెప్పాడు. ఒక రోజులో ఎలాగూ డబ్బింగ్ పూర్తి కాకుండా ఆగిపోతుందని ఆయన అనుకున్నారు. సినిమా మొత్తం 1200 అడుగుల రీల్ వస్తే, ఎడిటర్‌ను రిక్వెస్ట్ చేసి, మొత్తం ఒకే రీల్‌గా మార్చాను. ఆ విషయం రాజేంద్రప్రసాద్‌కు తెలియదు. దీంతో మధ్యాహ్నం 1గంటకే డబ్బింగ్ పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయారు. ‘ఇంకా పాట చేయాలి కదా. ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు. ఆ తర్వాత పాట షూటింగ్‌కు రమ్మని పిలిస్తే, ‘నాకు కుదరదయ్యా.. సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావు కదా చేసుకో పో’ అన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతటితో రాజేంద్రప్రసాద్ నిష్క్రమించగా.. ఇక ఆయన్ను బతిమాలాల్సిన అవసరం లేదని భావించానని కృష్ణారెడ్ఢి తెలిపారు. ఆపై వెంటనే బాబూమోహన్‌తో సాంగ్ తీయాలని నిర్ణయించుకుని బాబూమోహన్‌తో మాట్లాడి ఒప్పించినట్లు తెలిపాడు. బాబుమోహన్, సౌందర్యతో పాట తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత కొందరి మధ్యవర్తులను తన వద్దకు పంపినట్లు చెప్పాడు. సాంగ్ తీసేందుకు రాజేంద్రప్రసాద్ రెడీగా ఉన్నారని వారు చెప్పారు. అయితే ఇక నాకు ఆ అవసరం లేదని, ఇప్పటికే బాబూమోహన్‌కు మాట ఇచ్చేశానని చెప్పడంతో వారు వెళ్లి పోయారు. కావాలాంటే రాజేంద్రప్రసాద్ షూటింగ్ స్పాట్ వద్దకు రావొచ్చని, చూసి వెళ్లొచ్చని చెప్పాను. అని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. చిత్రపరిశ్రమలో తాను దర్శకుడిగా ఎదగడానికి ప్రధాన కారణం రాజేంద్ర ప్రసాద్ అని ఎస్వీ కృష్ణారెడ్ఢి చెప్పారు. తన సినీ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ సహకారం ఎంతో ఉందని కూడా ఇదే సందర్భంలో అన్నారు. కానీ మాయలోడు సినిమా విషయంలో మాత్రం తనను రాజేంద్రప్రసాద్ తీవ్రంగా బాధపెట్టారని ఎస్వీ కృష్ణారెడ్ఢి గుర్తు చేసుకున్నారు. గతేడాది 'ఆర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' అనే చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్ఢి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. -
ఇదొక శుభ పరిణామం -ఎస్.వి.కృష్ణారెడ్డి
సుధీర్ బాబు, నందిత జంటగా అందమైన ప్రేమకథగా తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఆర్. చంద్రు దర్శత్వంలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం ఆగస్టు 7న 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఆనంద సమయంలో ఏదైనా చేయాలనుకున్నా. అందుకే చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘సినిమా చూపిస్త మావ’ యూనిట్‌ను సత్కరిస్తున్నాను’’ అని చెప్పారు. ఒక హిట్ చిత్రాన్ని మరో హిట్ చిత్ర సభ్యులు సత్కరించడం శుభ పరిణామమని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్.వి. కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలో ‘సినిమా చూపిస్త మావ’ చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు త్రినాథరావుతో పాటు దర్శకుడు ‘మధుర’ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
జన్మంటూ ఉంటే స్విస్‌లో పుట్టాలి!
జీవితాన్ని బాగా ఇష్టపడతారు నటుడు అలీ. భూత, భవిష్యత్, వర్తమానాలపై ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. దేన్నీ తేలిగ్గా తీసుకోరు. ఎదురైన ప్రతి అనుభవాన్నీ ప్రేమిస్తారు. కాసేపు మాట్లాడితే చాలు.. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి.. ఇలా నాన్‌స్టాప్‌గా ఎన్నో విషయాలు చెబుతారు. ఆయన అభిరుచుల్ని తెలుసుకోవడానికి చేసిన చిరు ప్రయత్నం... వాళ్లిద్దరి సినిమాలూ పక్కన పెడితే నేను లేను! నా జీవితంపై అయిదుగురి ప్రభావం బలంగా ఉంది. వారు.. నా గురువుగారు శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా, దర్శకులు కె. రాఘవేంద్రరావు, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి. బాల్యంలోనే రాజమండ్రిలో కళాకారుడిగా నా ప్రయాణం మొదలైంది. అప్పుడు మా గురువు మిత్రాగారే అన్నీ తానై నన్ను నడిపించారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మిమిక్రీ ప్రోగ్రామ్‌లు చేశాను. ఇక, సినిమాల్లోకొచ్చాక... వెన్నంటి ఉండి నడిపించింది - రాఘవేంద్రరావుగారు. ఒక వ్యక్తిగా ఆయనను చూసి చాలా నేర్చుకున్నా. ఇక, జంధ్యాల గారి సినిమాల్లో నేను నటించింది తక్కువైనా, కమెడియన్‌గా నాపై అంతులేని ప్రభావాన్ని చూపించారాయన. ఇక ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి. వీళ్లిద్దరి సినిమాలను పక్కన పెట్టి అలీని చూస్తే ఏమీ కనిపించదు. దశాబ్దం పాటు నా వేలు పట్టుకొని నడిపించారు ఈవీవీ. నన్ను హీరోను చేసి కెరీర్‌ను పూర్తిగా మార్చేశారు కృష్ణారెడ్డి. ఈ అయిదుగుర్నీ జీవితంలో మర్చిపోలేను. మళ్లీ జన్మంటూ ఉంటే స్విస్‌లో పుట్టాలి! కళాకారుణ్ణి కావడం వల్ల, ముఖ్యంగా సినిమా నటుణ్ణి అవడం వల్ల.. ప్రపంచం మొత్తం తిరగగలిగాను. ఎన్ని దేశాలు తిరిగినా... ఓ అయిదు ప్రాంతాలు మాత్రం నా మనసులో అలా నిలిచిపోయాయి. అవే.. రాజమండ్రి, కేరళ, కన్యాకుమారి, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్. వీటిల్లో రాజమండ్రి నా జన్మస్థలం. నటుడిగా నేను ఓనమాలు దిద్దింది కూడా అక్కడే. సో... రాజమండ్రిని అభిమానించడంలో తప్పేం లేదు. ఇక కన్యాకుమారి విషయానికొస్తే... ‘సీతాకోక చిలుక’ సినిమా అక్కడే ఎక్కువ తీశారు. సినీ నటునిగా నా తొలి అడుగులు పడ్డవి అక్కడే. అందుకే కన్యాకుమారి ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోయింది నాకు. న్యూజిలాండ్ అంటే ఇష్టపడడానికి కారణం... అక్కడ కాలుష్యం సున్నా. నేరాలు శూన్యం. ఎంత ఉండాలో అంతే ఉండే జన సాంద్రత. స్విట్జర్లాండ్ విషయానికొస్తే... ‘ఇక్కడేమైనా కర్ఫ్యూ పెట్టారా!’ అన్నట్లు ఉంటుంది. చాలా ప్రశాంత వాతావరణం. మనం కలలో కూడా చూడనన్ని అందమైన రంగులతో రకరకాల పూలమొక్కలు రోడ్డు పక్కనే దర్శనమిస్తుంటాయి. అంతేకాదు... ఏదైనా పని ఉంటే తప్ప జనం ఇళ్ల నుంచి బయటకు రారు. ‘మళ్లీ జన్మంటూ ఉంటే... స్విస్‌లోనే పుట్టాలి’ అనిపిస్తుంది అక్కడి వాతావరణం. చివరగా కేరళ. అక్కడ ఇంట్లో అయిదుగురు సభ్యులుంటే... నలుగురు పనిచేస్తారు. రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి వ్యక్తీ కష్టపడతాడు. ఇళ్ల ముందు ఆకులు రాలినా... వాటిని చిమ్మి, కుప్పగా పోసి, కిరోసిన్ పోసి తగులపెడతారు. నీట్‌గా ఉంటారు. నీతిగా ఉంటారు. అమ్మాయిలైతే అందంగా ఉంటారు. దాదాపు అందరూ చదువుకున్నవాళ్లే. నా జీవితం ఆధారంగా బోల్డన్ని పుస్తకాలు రాయొచ్చు! నేను పుస్తకాలు చదవను. అయినా... నా జీవితంలోనే కావాల్సినన్ని ఘట్టాలున్నాయి. వాటి ఆధారంగా బోల్డన్ని పుస్తకాలు రాయొచ్చు. తల్లిదండ్రుల దగ్గర పెరగాల్సిన వయసులో వాళ్లను వదులుకొని దూరంగా బతికాను. మా ఊరు కాని ఊరు మద్రాసులో, భాష కాని భాష మధ్య నాకంటూ నేపథ్యం కానీ, ఎవరి సహాయం, తోడు కానీ లేకుండా కొన్నేళ్ల పాటు జీవనం సాగించాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఇది మామూలు విషయం కాదు. నాది మామూలు జన్మ కాదని నేను నమ్ముతాను. నా జీవితమనే పుస్తకాన్ని ఎప్పటికప్పుడు నెమరువేసుకోవడమే నాకు సరిపోతుంది. ఇక వేరే పుస్తకాలు చదివే టైమ్ ఎక్కడిది! - బుర్రా నరసింహ -
నన్నలా తీర్చిదిద్దారు
‘‘నేను స్కూలు చదువులు చదివింది పెద్దగా లేదు కాబట్టి, అక్కడి గురువులు గురించి చెప్పలేను. నా 9వ ఏట నుంచి నన్ను వేలుపట్టి నడిపిస్తూ నాతో లెక్కలేనన్ని ప్రోగ్రామ్స్ చేయించింది జిత్‌మోహన్ మిత్రాగారు. నా జీవితానికి దొరికిన అద్భుతమైన గురువు ఆయన. మిత్రాగారు చేసే అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను మిమిక్రీ చేసేవాణ్ణి. ఆ విధంగా నాకు స్టేజ్ ఫియర్ లేకుండా, మాస్‌తో కనెక్ట్ అయ్యేవిధంగా నన్ను తీర్చిదిద్దింది మిత్రాగారే. అప్పట్లో నాకు 5 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు. అదే నాకు వేలు, లక్షల కింద లెక్క. నేను ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా, ముందు మా గురువు పేరే చెబుతాను. ఇక సినిమా ఫీల్డ్ విషయానికొస్తే -కె.రాఘవేంద్రరావుగారు, రవిరాజా పినిశెట్టిగారు, ఈవీవీగారు, ఎస్వీ కృష్ణారెడ్డిగారు, పూరి జగన్నాథ్ నన్ను ప్రతి దశలోనూ ఎంకరేజ్ చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో ఫేజ్‌లో నాకు అండగా నిలబడి, నా కెరీర్‌ని సుసంపన్నం చేశారు. అందుకే వాళ్లని కూడా నేను గురువులుగానే భావిస్తాను. - అలీ