బాబోయ్.. బాబాయ్
♦ చిన్నారిని నిర్బంధించిన చిన్నాన్న.. చేతులు విరిచి కట్టి నోటికి ప్లాస్టర్
♦ అన్న ఆర్థికంగా సహకరించలేదనే.. ఓ మహిళ, స్నేహితుడు అరెస్టు
♦ ప్రకాశం జిల్లా కనిగిరిలో కలకలం.. 12 గంటల్లోనే చేధించిన పోలీసులు
ఒంగోలు క్రైం: ప్రకాశం జిల్లా కనిగిరిలో సొంత అన్న కూతురిపై తమ్ముడు కర్కశంగా వ్యవహరించాడు. ఆర్థికంగా అన్న సహకరించలేదనే అక్కసుతో ఆరేళ్ల చిన్నారిని అపహరించి అమానవీయంగా ప్రవర్తించాడు. పాపను పెడరెక్కలు విరిచి కట్టేసి, కళ్లకు గంతలు కట్టి, నోటికి ప్లాస్టర్ వేసి, బోర్లా పడుకోబెట్టి అతి కిరాతకంగా నిర్బం ధించాడు. చిట్టితల్లి విడిపించుకోవడానికి పెనుగులాడినా విడిచిపెట్టలేదు. చివరకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 12 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు.
అతనికి సహకరించిన మరో మహిళ, స్నేహితుడిని అరెస్టు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. కనిగిరికి చెందిన దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి చిన్న కుమార్తె సహస్రను గురువారం సొంత తమ్ముడు రాజేశ్‌రెడ్డి తన స్నేహితునితో కలసి కిడ్నాప్ చేశాడని తెలిపారు. ముఖానికి ముసుగులు ధరించి, తలపై హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఇంటివద్ద ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి బైక్‌పై విజయవాడకు తీసుకెళ్లి ఓ అపార్ట్మెంటులో బంధించారన్నారు. కిడ్నాప్ సమాచారం అందగానే రాజేశ్‌రెడ్డి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారని చెప్పారు.
ఆర్థికంగా సహకరించటంలేదన్న కోపంతో అన్న శ్రీనివాసులురెడ్డిపై పెంచుకున్న అక్కసే ఈ దుశ్చర్యకు పాల్పడేటట్టు చేసిందన్నారు. సెల్ ఫోన్‌ను ఇంటివద్దే వదిలేయడం, విధులకు వెళ్లకపోయినా వచ్చినట్లు సహ ఉద్యోగులతో చెప్పిం చడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. ఏమీ తెలియనట్టు పాప తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఇంకోవైపు కిడ్నాప్ చేసిన నిందితులతో మాట్లాడుతున్న విషయూన్ని పసిగట్టామన్నారు. రూ.50 లక్షలిస్తే పాపను వదిలేస్తామని, పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించాడని తెలిపారు. ఫోన్‌కాల్ లొకేషన్‌కు అనుగుణంగా పాప, బాబాయి కదలికలు ఉండటంతో అనుమానాలకు బలం చేకూరిందన్నారు. కనిగిరి సమీపంలోని గుళ్లాపల్లి టోల్గేట్ వద్ద నిందితుణ్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో కిడ్నాప్ వెనుక తానే ఉన్నానని అంగీకరించాడని వివరించారు.
స్నేహితురాలి కాపలా..: పాపను దాచిన అపార్ట్మెంట్ వద్దకు నిందితుడు పోలీసులను తీసుకెళ్లాడు. అపార్ట్మెంట్లో రాజేశ్‌రెడ్డి స్నేహితురాలు షేక్ బషీరాను కాపలాగా ఉంచాడు. ఊపిరాడక పెనుగులాడుతున్న చిన్నారిని పోలీసులు కట్లు ఊడదీసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. ప్రధాన నిందితుడు రాజేశ్‌రెడ్డితోపాటు అతనికి సహకరించిన సాల్మన్, షేక్ బషీరాలను అరెస్ట్ చేసి.. వారివద్ద నుంచి మోటార్ సైకిల్, కత్తులు, మాస్క్‌లు, గ్లౌస్లు స్వాధీనం చేసుకున్నారు. 12 గంటల్లో ఛేదించిన సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీకాంత్ రివార్డులు ప్రకటించారు.