జనరిక్.. జనానికి దూరం!
–చౌకగా మందులు లభిస్తున్నా ఆదరణ కరువు
–అవగాహన కల్పించని వెలుగు సిబ్బంది
–మూతదిశగా ‘అన్న సంజీవని’ దుకాణాలు
కర్నూలు(హాస్పిటల్): అన్న సంజీవని(జెనరిక్ మందులు) దుకాణాలు ఆపదలో ఉన్నాయి. చవకగా లభించే జనరిక్ మందుల గురించి ప్రజలకు తెలియకపోడంతో వాటిని కొనుగోలు చేసేవారు కరువవుతున్నారు. చాలా మంది వైద్యులు అన్న సంజీవని ఔషదిపై దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికితోడు వెలుగు సిబ్బంది సరైన ప్రచారం కల్పించకపోవడంతో జిల్లాలో చాలా చోట్ల ఇవి మూతపడే స్థితికి చేరుకున్నాయి. మొదట్లో వీటిని మండల మహిళా సమాఖ్యలు నిర్వహించినా, నష్టాల్లో ఉండటంతో అందులోని సభ్యులతో నిర్వహిస్తున్నారు. అయినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.
నష్టాల్లో దుకాణాలు..
జిల్లాలో డీఆర్డీఏ–వెలుగు ఆధ్వర్యంలో ప్యాపిలి, బేతంచర్ల, కోడుమూరు, పత్తికొండ, ఆలూరులలో అన్న సంజీవని దుకాణాలు ఉన్నాయి. ఇవేగాక మెప్మా ఆధ్వర్యంలోనూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండు, నంద్యాల, ఆదోని, నందికొట్కూరులలో మరో మూడు దుకాణాలు ఏర్పాటు చేశారు. మెప్మా ఆధ్వర్యంలోని దుకాణాలు కాస్త మెరుగ్గా పనిచేస్తున్నా డీఆర్డీఏ ఆద్వర్యంలో నడిచేవి చాలా వరకు నష్టాల్లో ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేసిన మండల మహిళా సమాఖ్య, పొదుపు సంఘాల మహిళలకు మందులపై అవగాహన లేకపోవడం, మందుల కొనుగోళ్లు, అమ్మకాలపై అక్కడ పనిచేసే ఫార్మాసిస్టులకు తెలియకపోవడం కూడా నష్టాలు రావడానికి కారణాలుగా తెలుస్తోంది. ఇక స్థానిక వైద్యులు సహకరించకపోవడంతో ఇవి మూతదశకు చేరుకున్నాయి.
ఇదీ దుకాణాల పరిస్థితి...
–కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండు దుకాణాలు పట్టణ మహిళా సమాఖ్యలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇందులో అధిక శాతం బ్రాండెడ్ జనరిక్స్కు బదులు ప్రాపగండ మందులు విక్రయిస్తున్నారు. ఈ కారణంగా రోగులకు మరింత చవకగా లభించాల్సిన మందులు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
– ప్యాపిలిలోని దుకాణం ఊరి చివర ఉంది. దీంతో ఇది ఆదరణకు నోచుకోలేదు. బేతంచర్లలో పాతబస్టాండ్ ప్రాంతంలో ఉన్న దుకాణం మాత్రం ఫరవాలేదనిపిస్తోంది.
–కోడుమూరులో ఏర్పాటు చేసిన దుకాణంలో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
–ఆలూరులో ఏర్పాటు చేసిన అన్న సంజీవని బాగానే నడుస్తోంది
–పత్తికొండలోని దుకాణం పరిస్థితి దారుణంగా ఉంది. రోజుకు రూ.500ల నుంచి రూ.1000లు కూడా వ్యాపారం జరగని పరిస్థితి. దీంతో ఇక్కడ పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి.
అవగాహన కల్పిస్తున్నాం
అన్న సంజీవనిపై ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించాం. ర్యాలీలతోపాటు, కరపత్రాలు పంపిణీ చేశాం. అన్న సంజీవని దుకాణాల్లో మందులు నాణ్యమైనవి, చవకగా లభిస్తాయి. స్థానిక వైద్యులు ప్రజలకు అవగాహన పెంచాలి. –నర్సమ్మ, అన్న సంజీవని ఇన్ఛార్జి