కట్టుబట్టలతో పరుగో.. పరుగు
లాస్ ఎంజెల్స్: ఎగిసిపడుతున్న కార్చిచ్చు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రజల గుండెల్లో రైల్లు పరుగెత్తిస్తోంది. శరవేగంగా దావానలం దూసుకొస్తుండటంతో కాలిఫోర్నియాలోని శాంటా క్లారిటా అనే ప్రాంతానికి చెందిన వాళ్లంతా ప్రాణభయంతో పరుగులుపెడుతున్నారు. కట్టుబట్టలతో తమ నివాసాలను వదిలి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతమంతా తీవ్ర వేడి, దట్టంగా కమ్ముకొన్న పొగలతో నివసించేందుకు బెంబేలెత్తిపోయేలా తయారవడంతో అక్కడ ఉండలేకపోతున్నారు.
దాదాపు 20 వేల ఎకరాలను అగ్ని దహిస్తోంది. అధికారులు హెలికాప్టర్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ మరింత వేగంగా అవి వ్యాపిస్తున్నాయి. ఇప్పటి వరకు 1500 వందల కుటుంబాలు తమ నివాసాలను వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఈ మంటల కారణంగా దాదాపు 100 వాణిజ్య నిర్మాణాలకు ప్రమాద పరిస్థితి తలెత్తిందట. ప్రస్తుతానికి 28 హెలికాప్టర్లతోపాటు మొత్తం 900 మంది అగ్నిమాపక సిబ్బంది ఈ కార్చిచ్చును చల్లార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.