రెండోవిడత ఫ్రీడమ్ ఫోన్ లక్కీ కస్టమర్లు ఎవరో..?
ఎన్నో వాయిదాల పర్వం అనంతరం తొలి విడతగా 5000 యూనిట్ల ఫ్రీడం 251 స్మార్ట్ఫోన్లను డెలివరీ చేసిన రింగింగ్ బెల్స్ సంస్థ, మరిన్ని స్మార్ట్ఫోన్ల పంపిణీ చేపట్టిందట. ఈ పంపిణీని లాటరీ నుంచి ఎంపికచేసిన వినియోగదారులకు అందిస్తోందట. అయితే ఈ విడతలో అందుకోబోతున్న లక్కీ కస్టమర్లు ఎవరో అన్ని వినియోగదారుల్లో ఆతృత చోటుచేసుకుంది. లాటరీ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రర్ వినియోగదారులను ఎంపికచేసి, రెండోవిడతగా మరో 65వేల ఫ్రీడమ్ 251 స్మార్ట్ఫోన్ల డెలివరీ ప్రారంభించామని రింగింగ్ బెల్స్ సోమవారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, న్యూఢిల్లీ, పంజాబ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖాండ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ డెలివరీ చేపట్టినట్టు వెల్లడించింది.
బడా బడా స్మార్ట్ఫోన్ కంపెనీలకు షాకిస్తూ ఎవరూ ఊహించినంతగా కేవలం 251 రూపాయలకే ఫ్రీడమ్ స్మార్ట్ఫోన్ను రింగింగ్ బెల్స్ విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ధరకు స్మార్ట్ఫోన్ వస్తుండటంతో, ఒక్కసారిగా ఈ ఫోన్కు 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వెల్లువెత్తాయి. చాలా రోజులు ఊరిస్తూ వచ్చిన రింగింగ్ బెల్స్ ఆఖరికి గత నెలలో మొదటి డెలివరీ కింద 5000 స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. తాజాగా మరో 65వేల యూనిట్ల డెలివరీతో, మొత్తం షిప్పిమెంట్ను 70వేలకు చేర్చుకోనుంది.
కొన్ని రోజుల కిందట లాటరీ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రర్ వినియోగదారులను ఎంపికచేశామని, ప్రస్తుతం వారికి ఈ ఫోన్లను డెలివరీ చేస్తున్నామని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. తక్కువ ధరకు క్వాలిటీ ఫోన్ను అందించడంపై కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. వారి సంతృప్తికరమైన స్పందన తమకు అపారమైన ఆనందాన్ని చేకూర్చిందన్నారు. కనీసం రెండు లక్షల రిజిస్ట్రర్ యూజర్లకు ఈ ఫోన్లను డెలివరీ చేయాలనుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించింది. మరో రెండు బడ్జెట్ స్మార్ట్ఫోన్లను, నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను, మూడు పవర్ బ్యాంకులను, 31.5 ఎల్ఈడీ టీవీని రింగింగ్ బెల్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.