క్రీడలతో వ్యక్తిత్వ వికాసం
కొత్తగూడెం, న్యూస్‌లైన్: క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయని సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ (పర్సనల్) కె.బి.ఎస్.సాగర్ అన్నారు. మూడురోజుల పాటు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల మహిళా క్రీడాపోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్న వాళ్లే అన్ని రంగాల్లో రాణిస్తూ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం పొందుతారన్నారు. సింగరేణి సంస్థ సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. విద్యార్థినులు క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, స్నేహభావంతో మెలగాలన్నారు. క్రీడల్లో మెళుకవలు నేర్చుకోవాలని సూచించారు. గెలుపు ఓటములకు ప్రాధాన్యత ఇవ్వకుండా పోటీల్లో పాల్గొనాలని జీఎం (ఎడ్యుకేషన్) వై.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఎంత ఇష్టంతో క్రీడల్లో పాల్గొంటామో అదే శ్రద్ధనూ చదువుల్లో కనబరచాలని సూచించారు. తొలుత కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం కళాశాలల విద్యార్థినులు మార్చ్ఫాస్ట్ నిర్వహిం చారు. బెలూన్లను ఎగురవేసి పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలు అలరించాయి. కబడ్డీ పోటీలను కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ఫిజికల్ డెరైక్టర్ శ్రీనివాసరెడ్డి, కిట్స్ వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ సీఐ కిషన్ ప్రారంభించారు. ప్రారంభ మ్యాచ్‌లో కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల, ఖమ్మం ప్రియదర్శిని కళాశాల విద్యార్థినులు తలపడ్డారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ కమలారాణి, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఇందిర, క్రీడల నిర్వాహకురాలు, మహిళా కళాశాల ఫిజికల్ డెరైక్టర్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు