జలధీశ్వరా పాహిమామ్
శివరాత్రి స్పెషల్ – 1
జలధీశ్వర ఆలయం.
రెండవ శతాబ్దికి చెందిన అతి పురాతన దేవాలయం.
శ్రీశైలం, శ్రీకాళహస్తి దేవాలయాలకు విభిన్నంగా
ఏకపీఠం మీద శివపార్వతులు దర్శనమిచ్చే అరుదైన దేవాలయం.
శివరాత్రి సందర్భంగా ఘంటసాల గ్రామంలో కొలువుతీరిన జలధీశ్వరాలయంపై ప్రత్యేక వ్యాసం.
విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే దారిలో కొడాలికి ఎడమవైపున అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘంటసాల గ్రామంలోని శ్రీబాలపరమేశ్వరీ సమేత జలధీశ్వరాలయం ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి. విజయవాడకు 60 కి.మీ. దూరంలో ఉన్న ఈ దేవాలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చి భగవంతుని దర్శించుకుంటారు. త్రికాల సంధ్యాస్నానాలకు అనువుగా సముద్ర తీరంలోని ఈ గ్రామంలో బాలపార్వతీ సమేతంగా జలధీశ్వరునిగా కొలువై ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలను, అష్టాదశ శక్తిపీఠాలను దర్శిస్తే వచ్చే పుణ్యమే ఈ దేవాలయ సందర్శన వల్ల కూడా కలుగుతుందని స్థలపురాణం చెబుతోంది. జలధీశ్వర అభిషేక జలం సేవిస్తే అనేక వ్యాధులు నయమవుతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం.
శివుని కోరిక మేరకు...
ఏకపీఠే విరాజన్తం సర్వమంగళాయా సహా ఘంటశాల పురాధీశం జలధీశ్వర ముపాస్మహే భస్మాలంకృత సర్వాంగం అగస్త్యేన ప్రతిష్ఠితం భక్తాభీష్ట ప్రదం వందే అద్వైత జ్ఞాన సిద్ధయే‘‘ పూర్వం శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి సృష్టిలోని సకల జీవకోటి భక్తితో ఉత్తరాపథానికి తరలి వెళ్లింది. జీవకోటి భారంతో ఉత్తరాపథం కృంగిపోసాగింది. అప్పుడు పరమేశ్వరుడు అగస్త్య మహర్షిని పిలిచి సృష్టి సమతుల్యం కావడం కోసం తక్షణమే దక్షిణాపథానికి వెళ్లి, పవిత్రప్రదేశంలో శివపార్వతుల విగ్రహప్రతిష్ఠ జరిపి ఏకాగ్రతతో పూజలు జరిపితే తమ కల్యాణ మహోత్సవ సందర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పాడు. దాంతో అగస్త్యుడు దక్షిణాపథానికి వచ్చి ఘంటసాల గ్రామంలో ఏకపీఠంపైన శివపార్వతులను ప్రతిష్ఠించాడని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది.
జలధి ఒడ్డున ఉన్న శివుడు
ఘంటసాల గ్రామానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందిన గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టాలెమీ ఈ గ్రామాన్ని ‘కంటకస్సిల’ అని పేర్కొన్నాడు. సిద్ధార్థుని గుర్రమైన కంటకం పేరు మీద ఈ గ్రామానికి కంటకశైలమనీ, తరువాత కంటకశిల అనీ రానురాను ఘంటసాలగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకారంభంలో ఇదొక రేవు పట్టణంగా ఉండేదనీ, ఇక్కడ వర్తక వాణిజ్యాలు సాగించిన మహా నావికులున్నారనీ, క్రీ.శ. 3వ శతాబ్దంలో ఉపాసిక బోధిసిరి ఇక్కడొక శిలామండపాన్ని కట్టించిందని శాసనాలు తెలియచేస్తున్నాయి. ఈ గ్రామంలో శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి నాణాలు, రోమన్ నాణాలు, శాలంకాయనుల నాణాలు లభించాయి. ఇక ఈ గ్రామంలోనే ఉన్న జలధీశ్వర ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు ఆధారాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇది అతి పురాతన ఆలయాలలో నాలుగవదని పురావస్తు శాస్త్రకారులు చెబుతున్నారు. గుడిమల్లం, అమరావతి, దాక్షారామం... ఆలయాలలోని శివలింగాన్ని పోలి ఉంటుంది ఇక్కడి శివలింగం. అప్పట్లో వ్యాపార నిమిత్తం సముద్రంలో (జలధిలో) పడవలలో ప్రయాణించిన వర్తకులు, మత్స్యకారులు, నావికులు ఇక్కడి శివుడిని అర్చించడం వల్ల ఈయనకు జలధీశ్వరుడని పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి శివుడు శివలింగం ఆకారంలో పార్వతీ సమేతుడై ఏక పానవట్టం మీద దర్శనమిస్తాడు. ఇది చాలా అరుదైన దృశ్యం. ఏక పీఠం మీద శివపార్వతులు ఉన్న ఏకైక దేవాలయం ఇదే అని చెప్పవచ్చు. సాధారణంగా గర్భగుడికి ఎదురుగా నంది దర్శనమిస్తాడు. ఇక్కడ మాత్రం పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా ఇద్దరినీ సమదృష్టితో చూస్తూ కనువిందు చేస్తాడు నందీశ్వరుడు.
ఆలయంలో పూజలు
ప్రతిరోజూ ఉదయం 6 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు, సాయంత్రం 5 గం. నుంచి రాత్రి 8 గం. వరకు. ఏటా జరిగే ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలు ప్రతినెలా మాస శివరాత్రి సందర్భంగా నమకం, చమకం, శ్రీసూక్తంతో రుద్రాభిషేకాలు మాఘ పూర్ణిమ సందర్భంగా స్వామివారి కళ్యాణం దేవీ నవరాత్రులు, కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు విశేష పూజలు ఏటా డిసెంబర్లో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు. మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు
నాటి కంటక శాలే.. నేటి ఘంటశాల
శాతవాహనుల కాలంలో ఇది బౌద్ధస్థావరంగా ఉన్నట్లు తవ్వకాల్లో తెలిసింది. ఇక్ష్వాకుల కాలంలో ఈ ప్రాంతాన్ని జీర్ణోద్ధరణ చేశారు. సిద్ధార్ధుడు ఇల్లు విడిచి వెళ్లినప్పుడు ఒక గుర్రం మీద వెళ్లాడట. ఆ గుర్రం పేరు కంటక. ఆ గుర్రం పేరు, కొండను పోలిన స్థూపం పేరు కలిపి కంటకశాల అయిందని, రానురాను ఘంటసాల అయ్యిందని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతం అప్పట్లో వర్తక స్థావరంగా కూడా వెలిసింది. నహపాలుడు శకవంశానికి చెందినవాడు. దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే శకనాణాలు దొరికాయి. 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతానికి చోళపాండ్యపురం అని పేరు. జలధిని ఈశ్వరునిగా భావించి, జలధీశ్వరస్వామిని ప్రతిష్ఠించి శివాలయాన్ని నిర్మించారు. మొదటి వేయిసంవత్సరాలు ఇక్కడ బౌద్ధం విరాజిల్లింది. తరువాత నుంచి జలధీశ్వరస్వామితో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. జలధీశ్వరస్వామి శివలింగంలో ఒక ప్రత్యేకత ఉంది. పలనాటి సున్నపు రాతితో ఈలింగాన్ని రూపొందించారని స్థానికులు చెబుతారు. ప్రాకృత, తెలుగు, కన్నడ శాసనాలు ఉన్నాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో చాలామంది ఇక్కడ నుంచి పాల్గొన్నారు.
– ఈమని శివనాగిరెడ్డి, సిఈవో, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ
ఇలా చేరుకోవాలి...
రోడ్డు మార్గం: తెలుగు రాష్ట్రాలలోని అన్నిప్రాంతాల నుంచి ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది.
రైలు మార్గం: మచిలీపట్నం అతి సమీప రైలుస్టేషన్. ఇక్కడ నుంచి ఘంటసాల 27కి.మీ. దూరంలో ఉంది.
విమాన మార్గం: విజయవాడ అతి సమీప విమానాశ్రయం. ఇక్కడ నుంచి 50 కి.మీ. దూరం. ఇక్కడ నుంచి ఆర్టిసి బస్సులు, ప్రైవేట్ బస్సులు, టాక్సీలు దేవాలయం వరకు దొరుకుతాయి. ఆలయ సందర్శన వేళలు: ఉదయం 6.30 నుండి రాత్రి 9.30 వరకు
అనేక ప్రత్యేకతలు
ఆలయానికి ఎదురుగా గోపురం, మూడువైపులా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఆలయ మహామండపానికి ఇరువైపులా పల్నాటి సున్నపురాయితో చెక్కిన భైరవుడు, నరసింహస్వామి విగ్రహాలున్నాయి. నరసింహస్వామి క్షేత్ర పాలకునిగాను, భైరవుడు ద్వారపాలకుని గాను ఉండటం ఆ ఆలయంలో మరో ప్రత్యేకత. సరస్వతీమాత, మరికొందరు దేవతామూర్తుల విగ్రహాలు మనలను భక్తి పారవశ్యంలో ముంచుతాయి. ఇక్కడ ఉన్న సరస్వతీదేవి విగ్రహం మొహంజొదారో కాలానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతారు. ఘంటసాలలో ఇంకా వేణుగోపాలస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాంబ ఆలయం, భావనారుషి ఆలయం, రామాలయం, పెన్నేరమ్మ, ముత్యాలమ్మలకు కూడా దేవాలయాలు ఉన్నాయి.
– డా. పురాణపండ వైజయంతి
సాక్షి, విజయవాడ అవనిగడ్డ, కృష్ణాజిల్లా