స్టార్టప్స్ నిధులకు ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫాం
ముంబై: స్టార్టప్ సంస్థలు, ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు తమ వెంచర్ల కోసం నిధులు సమీకరించుకునేందుకు వీలుగా ‘ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం’ను (ఐటీపీ) ప్రవేశపెట్టాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. దీని ద్వారా ఇతర సంస్థలు, సంపన్న ఇన్వెస్టర్లు, క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఈ స్టార్టప్స్ నిధులు సమీకరించుకోవచ్చు. అయితే అధిక రిస్కుల దృష్ట్యా రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రం వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతులు ఉండవు. ఇందుకు సంబంధించి ‘ప్రత్యామ్నాయ పెట్టుబడుల సమీకరణ ప్లాట్‌ఫాం’పై సోమవారం విడుదల చేసిన చర్చాపత్రంలో సెబీ ఈ విషయాలు పేర్కొంది. స్టార్టప్ సంస్థలు విదేశీ మార్కెట్లకు వెళ్లకుండా దేశీయంగానే నిధులు సమీకరించుకునేందుకు తోడ్పాటు అందించడమే ఈ ప్రతిపాదన ప్రధానోద్దేశం. దీనిపై ఏప్రిల్ 20లోగా సంబంధిత వర్గాల అభిప్రాయాలు సెబీకి తెలియజేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఈ-కామర్స్, కొత్త తరం కంపెనీలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఐటీపీలో లిస్టింగ్ వ్యవధి ఏడాది పాటు వర్తిస్తుంది. ఆ తర్వాత స్టాక్ ఎక్స్చేంజీలకు మారొచ్చు. స్టార్టప్స్ దేశీయంగానే లిస్టయ్యేలా ప్రోత్సహించే దిశగా నిబంధనలను జూన్‌కల్లా ఖరారు చేయగలమని సెబీ చైర్మన్ యూకే సిన్హా తెలిపారు.