ఆస్పత్రిలో కూలిన లిఫ్ట్
సాక్షి, ముంబై: సైన్-చునాభట్టి ప్రాంతంలో ఉన్న ప్రముఖ సోమయ్య ఆస్పత్రిలో గురువారం సాయంత్రం లిఫ్టు కూలింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా ఇద్దరికి కాళ్లు, చేతులు విరిగాయి. మరొకరిపై లిఫ్టు పైనున్న ఫ్యాన్ మీదపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. బాధితులందరూ అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం సాయంత్రం వేళ (విజిటింగ్ అవర్స్) కావడంతో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించేందుకు బంధువులు ఆస్పత్రికి వచ్చారు. వారు ఎక్కిన లిఫ్టులో సాంకేతిక లోపంతో మూడో అంతస్తు నుంచి నేరుగా కిందపడింది. కిందున్న స్ప్రింగులను ఢీకొని మళ్లీ అదే వేగంతో ఒకటో అంతస్తు వరకు వెళ్లి మళ్లీ కిందపడింది. ఆ సమయంలో లిఫ్టులో 25 మంది ఉన్నట్లు సమాచారం.
ఈ కుదుపులకు అందులో ఉన్నవారు ఒకరిపై మరొకరు పడడంతో గాయపడ్డారు. ఈ లిఫ్ట్ ఇదివరకే అనేకసార్లు మరమ్మతులకు లోనైనా ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. కాగా ఈ లిఫ్టు సామర్ధ్యం 12 మంది మాత్రమే. కాని 25 మంది ఎక్కడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. కాగా, సాంకేతిక లోపంవల్లే ప్రమాదం జరిగిందని, యాజమాన్యం తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.
గజినీ సినిమా చిత్రీకరణ పనులు ఈ లిఫ్టులోనే..
ఆమిర్‌ఖాన్ నటించిన సూపర్ డూపర్ హిట్ గజినీ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఈ లిఫ్టులోనే జరిగాయి. జియాఖాన్‌ను గాలించేందుకు ఆమిర్‌ఖాన్ కాలేజీ క్యాంపస్‌లోకి వెళతాడు. అక్కడ జియాఖాన్‌ను ఇదే లిఫ్టులో బంధిస్తాడు. తర్వాత పోలీసులు అతణ్ని అరెస్టుచేసే సన్నివేశం ఈ లిఫ్టులోనే జరిగింది.