పుష్కర ప్రణాళిక రూపొందించండి
అధికారులకు పుష్కరాల ప్రత్యేక అధికారి
రాజశేఖర్ ఆదేశాలు
విజయవాడ : పుష్కర ఘాట్లను 150 నుంచి 200 మీటర్ల వరకూ ఒక సెక్టార్‌గా విభజించి, ప్రతి సెక్టార్లో ఉంచాల్సిన పరికరాలు, అధికారులకు సంబంధించిన మైక్రో లెవల్ ప్లానింగ్‌ను ప్రతి శాఖ రూపొందించాలని పుష్కరాల ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రతి సెక్టార్‌కు ఒక సబ్ కలెక్టర్ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమిస్తున్నట్లు చెప్పారు. పోలీస్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్.. తమ శాఖ అధికారులను ఆయా సెక్టార్లలో నియమించాలని సూచించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకూ రెండో షిఫ్టు, రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకూ మూడో షిఫ్టు నిర్వహించాలని సూచించారు. మూడు షిప్టులకు నియమించే ఉద్యోగుల పేర్లు, ఆధార్, మొబైల్ నంబర్ల నివేదిక జిల్లా యంత్రాంగానికి ఆదివారంలోపు అందించాలని ప్రత్యేక అధికారి రాజశేఖర్ సూచించారు.
మహిళా సంఘాల స్టాల్స్..
కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ ప్రతి ఘాట్లోనూ పిండప్రదానం ప్లాట్‌ఫాంను ఆనుకుని, పూజా ద్రవ్యాలు అమ్మే మహిళా సంఘాల స్టాళ్లు ఏర్పాటుచేయాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. డీఆర్డీఏ తరఫున మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకాల స్టాళ్లను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 150, పవిత్రసంగమం వద్ద 50, ప్రకాశం బ్యారేజీ దిగువన అప్రాన్ వద్ద 50 ఏర్పాటు చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మహిళా సంఘాలకూ చోటు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ జి.సృజన, డీఆర్వో సీహెచ్ రంగయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ శేషుకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.