విస్తరణ బాటలో డ్రివెన్..
♦ దేశంలో సెల్ఫ్ డ్రైవ్ పరిశ్రమ వృద్ధి
♦ మూడేళ్లలో 14 నగరాలకు విస్తరణ
♦ 5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా అద్దెకు కార్లు, బైకులనందిస్తున్న డ్రివెన్ స్టార్టప్.. విస్తరణ బాట పట్టింది. 2 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో 8 నెలల క్రితం తన సేవలను ప్రారంభించిన డ్రివెన్ ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో సేవలందిస్తుంది. సెల్ఫ్ డ్రైవ్ పరిశ్రమ వృద్ధి చెందుతుందని అందుకే మూడేళ్ల విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేశామని డ్రివెన్ కో-ఫౌండర్లు అశ్విన్ జైన్, కర్రర్ తాహెర్ చెప్పారు. బుధవారమిక్కడ డ్రివెన్ కెఫెను ప్రారంభించిన సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతానికి 160 కార్లు, 40 ద్విచక్ర వాహనాలు, 7 బై సైకిళ్ల ద్వారా శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటీ వంటి పలు ప్రాంతాల్లో ఔట్లెట్ల ద్వారా సేవలందిస్తున్నాం. మూడేళ్లలో 3 వేల కార్లు, 15 వేల ద్విచక్ర వాహనాలను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని’’ చెప్పారు.
రెండు విడతలో దేశంలోని 14 నగరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలి విడతగా చెన్నై, గోవా, ఢిల్లీ, ముంబై, పుణె, చంఢీఘర్, జైపూర్, ఉదయ్‌పూర్ నగరాలకు, ఆతర్వాత కోల్కత్తా, భువనేశ్వర్, నాగ్‌పూర్, లక్నో, షిమ్లా ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రతీ నగరంలోనూ 30-50 వాహనాలతో సేవలను ప్రారంభిస్తామని చెప్పారు. విస్తరణ నిమిత్తం 5 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టిపెట్టామని.. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు కూడా జరుపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్లు ఎస్ఎం జైన్, నబీల్ హుస్సేన్, మితీన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.