ఐఏఎస్ కుమార్తెకు వేధింపులు!
చండీగఢ్: హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్(23), అతని స్నేహితుడు ఆశిష్ కుమార్(27) తనను వెంటాడి వేధించారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మోటారు వాహనాల చట్టం కింద కేసు పెట్టి, బెయిల్‌పై విడుదల చేశారు. శుక్రవారం రాత్రి చండీగఢ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. నిందితులు న్యాయశాస్త్ర విద్యార్థులు.
రేడియో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న బాధితురాలు(28) తెలిపిన వివరాల ప్రకారం.. కారులో వెళ్తున్న ఆమెను మద్యం సేవించిన నిందితులు టాటా సఫారీ వాహనంలో 5 కిలోమీటర్లు వెంటాడారు. ఆమె కారుకు తమ వాహనాన్ని అడ్డంగా నిలిపి వేధించారు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరింది. తర్వాత పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తానని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి సోమవారం చెప్పారు. కేంద్రం, బీజేపీ దర్యాప్తును నీరుగారుస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. మరోపక్క.. తాను ఐఏఎస్ కుమార్తెను కాకుండా గ్రామీణ యువతినై ఉంటే దుండగులతో పోరాడలేకపోయి ఉండేదాన్నని బాధితురాలు పేర్కొన్నారు.