అమ్మాయిలకు మంత్రి వివాదాస్పద ప్రశ్నలు
తమిళనాడు క్రీడలు, యవజన సర్వీసుల శాఖ మంత్రి సుందర్ రాజ్.. విద్యార్థినుల పట్ల అగౌరవంగా ప్రవర్తించారు. జవాబులు చెప్పడానికి ఇబ్బందికరమైనటువంటి వివాదాస్పద ప్రశ్నలను మహిళా అథ్లెట్లను అడిగారు. సుందర్ రాజ్ ఇటీవల పుదుకొట్టాయ్లోని పాఠశాలను ఆకస్మింగా సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా అథ్లెట్లతో మంత్రి మాట్లాడారు. హాకీ క్రీడాకారిణులను ఉద్దేశించి మీకు తగినన్ని లోదుస్తులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్ని పతకాలు గెలిచారని అడిగిన మంత్రి ఆ తర్వాత ఏ పతకం కూడా గెలవకుంటే భోజనం ఎందుకు పెట్టాలని అన్నారు.
మంత్రి మరో విద్యార్థిని.. 'నీవు బరువు పెరిగావా, లేదా? నీకు భోజనం కోసం రోజు 250 రూపాయలు ఇస్తున్నాం. కాలేజీ విద్యార్థులకు నెలకు 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. వారి కంటే మీకే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం. మీ భోజనం కోసం మాత్రమే ఇస్తున్నాం' అని అన్నారు. మరో విద్యార్థిని దగ్గరికి వెళ్లి.. హాస్టల్లో చేరిన తర్వాత పెద్దమనిషివి అయ్యావా? అని ప్రశ్నించారు. విద్యార్థులను మంత్రి ఇలా ప్రశ్నించడం దుమారం రేపింది. అయితే తాను ఇలాంటి ప్రశ్నలను విద్యార్థులను అడగలేదని, వారిని ప్రోత్సహించేందుకు ప్రయత్నించానని మంత్రి చెప్పారు.