జలదిగ్బంధంలో మెదక్ పట్టణం
పొంగుతున్న పసుపులేరు, పుష్పలవాగులు
25 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు
మెదక్-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్
డిపోకే పరిమితమైన బస్సులు
మెదక్: వారం రోజులుగా కురుస్తున్న వానలకు మెదక్ పట్టణం ఆదివారం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. పసుపులేరు, పుష్పలవాగు బ్రిడ్జిలపై 3మీటర్ల ఎత్తు మేర నీరు ప్రవహిస్తుండటంతో హైదరాబాద్-తూప్రాన్, హైదరాబాద్- నర్సాపూర్, మెదక్-బొడ్మట్‌పల్లి, మెదక్, చేగుంట తో పాటు అనేక రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పలురోడ్లను మూసి వేయడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. మెదక్ డిపోలో 120 బస్సులుండగా కేవలం 5 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయని అధికారులు తెలిపారు. వరదలతో డిపో నిర్మానుష్యంగా మారింది.
పాతికేళ్ల క్రితం ఈ లాంటి నీటి ప్రవాహం వచ్చిందని, మళ్లీ ఇప్పుడే చూస్తున్నామంటు వయోవృద్ధులు చెబుతున్నారు. ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ఆర్అండ్బీ, పోలీసు అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. పలుశాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పొంగిపొర్లుతున్న వాగులవద్ద పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు స్థానికంగా ఉండాలనే ప్రభుత్వ ఆదేశంతో సెలవు రోజుల్లో సైతం అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.