ఆ ఇద్దరితో ద్విభాషా చిత్రం?
తమిళసినిమా: శశికుమార్, తెలుగు నటుడు నానీలతో దర్శకుడు సముద్రఖని ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం కోలీవుడ్లో జోరందుకుంది. నటుడు, దర్శకుడు అంటూ జోడు గుర్రాల స్వారీ చేస్తున్న సముద్రఖని ఇటీవల స్వీయ దర్శకత్వంలో నటించిన అప్పా, తొండన్ చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి.
మరో పక్క ఇతర చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్న సముద్రఖని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈయన తమిళంలో దర్శకత్వం వహించిన నాడోడిగళ్ చిత్రాన్ని తెలుగులో శంభో శివ శంభో పేరుతో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అదే విధంగా జయంరవి ద్విపాత్రాభినయం చేసిన నిమిర్న్దు నిల్ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందించారు. తెలుగులో జెండాపై కపిరాజు పేరుతో తెరకెక్కిన ఇందులో నాని కథానాయకుడిగా నటించారు.
అదేవిధంగా మరోసారి సముద్రఖని ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో తమిళవెర్షన్లో శశికుమార్, తెలుగులో నాని హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటించిన తెలుగు చిత్రం నిన్నుకోరి శుక్రవారం తెరపైకి రానుంది. నాని అక్కడ వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. సముద్రఖని దర్శకత్వంలో ఎప్పుడు నటిస్తారన్న విషయం గురించి క్లారిటి రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. శశికుమార్ ప్రస్తుతం కొడివీరన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.