అల్లుడు, మరో ఆరుగురు నేతలు అరెస్టు!
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదులకు నిధులు అందించడం, కశ్మీర్‌లోయలో అలజడికి ప్రేరేపించడం ఆరోపణలపై ఏడుగురు వేర్పాటువాద నేతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో కరుడుగట్టిన వేర్పాటువాద నేత సయెద్ అలీషా గీలానీ అల్లుడు అల్తాఫ్ అహ్మద్ షా అలియాస్ అల్తాఫ్ ఫంతోష్ కూడా ఉన్నాడు. ఇంకా అరెస్టైన వారిలో వేర్పాటువాద నేతలు నయీం ఖాన్, బిట్టా కరాటే, అయాజ్ అక్బర్, టీ సైఫుల్లా, మేరాజ్ కల్వాల్, సయీద్ ఉల్ ఇస్లాం ఉన్నారు.
వీరిలో బిట్టా కరాటేను ఢిల్లీలో అదుపులోకి తీసుకోగా, మిగతావారిని శ్రీనగర్‌లో అరెస్టు చేసి.. ఢిల్లీకి తరలించి విచారిస్తున్నారు. వీరికి గతంలోనే ఎన్ఐఏ నోటీసులు ఇచ్చినప్పటికీ.. వీరు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ముందస్తు కస్టడీలో ఉండటంతో గతంలో ఎన్ఐఏ ప్రశ్నించలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా వీరి అరెస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఢిల్లీలో విచారణకు హాజరుకావాల్సిందిగా వేర్పాటువాద నేతలకు ఎన్ఐఏ నోటీసులు ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించలేదు.