సిరియాపై అమెరికా వైమానిక దాడులు
బాగ్దాద్: సిరియాపై మళ్లీ అమెరికా దాడులకు దిగింది. ఇరాన్ మద్దతు కలిగిన ఇరాక్ మిలిటెంట్ గ్రూపు స్థావరాలపై గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు చేసింది. అమెరికా జరిపిన దాడిలో ఇరాకీ ఉగ్ర సంస్థకి చెందిన పలు స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో 22 మంది మరణించారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ చెబుతోంది. అయితే ఇరాక్ బలగాల అధికారి మాత్రం ఒక్కరే మరణించారని, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయని వెల్లడించారు. ఫిబ్రవరి మొదట్లో ఇరాక్‌లో అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన రాకెట్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులకు దిగినట్టుగా అమెరికా వెల్లడించింది. అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సైనిక చర్యలకు దిగడం ఇదే మొదటిసారి. సిరియా, ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న కతాబ్ హెజ్బుల్లా గ్రూపుకి చెందిన స్థావరాలకు మారణాయుధాలను తీసుకువెళుతున్న మూడు లారీలు అమెరికా దాడుల్లో ధ్వంసమయ్యాయి. హెజ్బుల్లా బ్రిగేడ్స్ అని కూడా ఈ గ్రూపును పిలుస్తుంటారు.
ఇరాక్‌లో అమెరికా బలగాలకు అండగా ఉంటాం : ఆస్టిన్
సిరియాలో వేటిని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగామో తమకు బాగా తెలుసునని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. మధ్య ప్రాచ్యంలో అమెరికా సైనిక బలగాల్ని మరింతగా విస్తరించి పట్టు పెంచుకోవడం కోసం బైడెన్ ఈ దాడులకు ఆదేశాలివ్వలేదని, ఇరాక్‌లో అమెరికా బలగాలకు మద్దతుగా ఉండడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని ఆస్టిన్ స్పష్టం చేశారు. లెబనీస్ హెజ్బుల్లా ఉద్యమం నుంచి విడిపోయిన ఇరాకీ కతాబ్ గ్రూపు మిలిటెంట్లు గతంలో ఇరాక్‌లో అమెరికా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని పలు దాడులకు పాల్పడినట్టు అగ్రరాజ్యం చాలాసార్లు ఆరోపించింది.