సిరియాలో ఐసిస్ నరమేధం
300 మంది ఊచకోత.. మరో 400 మంది నిర్బంధం
బీరుట్/డమాస్కస్: సిరియాలోని దేర్ ఎజార్ నగరంపై ఐసిస్ ఉగ్రవాద సంస్థ దాడి చేసి 300 మందిని ఊచకోత కోసిందని.. మరో 400 మందికి పైగా జనాన్ని బందీలుగా పట్టుకుందని సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ సానా ఆదివారం తెలిపింది. ఇరాక్ సరిహద్దున ఉన్న ప్రావిన్స్ రాజధాని నగరాన్ని ఐసిస్ తన గుప్పిట్లోకి తీసుకుందని శనివారం అన్ని వైపుల నుంచీ దాడికి పాల్పడిందని వెల్లడించింది. ఐసిస్ దాడుల్లో 138 మంది చనిపోయారని.. మృతుల్లో 50 మంది ప్రభుత్వ సైనికులు కాగా.. మిగతా వారు పౌరులని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది.
కొందరిని తుపాకులతో కాల్చి, మరికొందరిని తల నరికి చంపారని తెలిపింది. ఈ ఊచకోతను నిర్ధారించిన ఉగ్రవాదులు.. మృతుల్లో ఎక్కువమంది సిరియా సైనికులు, ప్రభుత్వ అనుకూల మిలీషియా సభ్యులు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారని ప్రకటించింది.