రేషనలైజేషన్ తర్వాత టీచర్ల భర్తీ
డిప్యూటీ సీఎం కడియం వెల్లడి
టెట్‌కు ముందే హేతుబద్ధీకరణకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. వచ్చేనెల 1న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తామని, ఈ పరీక్ష ఫలితాల కంటే ముందే హేతుబద్ధీకరణ చేపడతామని చెప్పారు. వచ్చే నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని సోమవారం విద్యాశాఖ కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. అలాగే జూనియర్, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ భర్తీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రణాళిక లు రూపొందించి ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేయనున్న పలు నిర్ణయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ వివరాలివీ..
యూనివర్సిటీల వారీగా ఆన్లైన్ ప్రవేశాలు
అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తారు. నిబంధనల ప్రకారం స్థలం, భవనం, వసతులు, ఫ్యాకల్టీ ఉంటేనే అనుబంధ గుర్తింపు, అనుమతులు ఇస్తారు. ఇందుకు అన్ని విభాగాలకు చెందిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్ పద్ధతిలో చేపడతారు. తద్వారా బోగస్ కాలేజీలు, బోగస్ విద్యార్థులు లేకుండా చూస్తారు. విద్యార్థుల ఆధార్ నెంబర్‌ను కూడా అనుసంధానం చేస్తారు. యూనివర్సిటీల వారీగా ఆన్లైన్ ప్రవేశాల విధానం అమల్లోకి తెస్తారు. అన్ని యూనివర్సిటీలు నిర్ణీత షెడ్యూలు, అకడమిక్ కేలండర్ ప్రకారం ప్రవేశాలు చేపట్టేలా చూస్తారు. ప్రవేశాల షెడ్యూల్, అకడమిక్ కేలండర్ వివరాలను విద్యార్థులకు ముందుగానే అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాలని భేటీలో నిర్ణయించారు.
మండలాల వారీగా విద్యా ప్రొఫైల్
పాఠశాలల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు అన్నింటి సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి సేకరిస్తారు. వాటి ఆధారంగా మండలాల వారీగా విద్యా ప్రొఫైల్ రూపొందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతారు. స్కూళ్లలో కనీస వసతులు కల్పిస్తారు. ప్రతి విద్యా సంస్థలో శుభ్రపరిచిన రక్షిత తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు.
కాలేజీలన్నింటిలో బయోమెట్రిక్
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే జూన్ 30 నాటికి ఈ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. స్కూళ్లలో విద్యార్థులకు బట్టలు అందించేందుకు ఆప్కో వద్ద క్లాత్ లేకపోతే ఓపెన్ టెండర్ ద్వారా తెప్పించాలని నిర్ణయించారు. దీనిపై ఆప్కో నుంచి నివేదిక కోరారు. విద్యా శాఖలో అన్ని సేవలను ఆన్లైన్ చేయనున్నారు. వర్సిటీల్లో వైఫై సదుపాయం కల్పించనున్నారు.
ప్రభుత్వ బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియంలో ప్రీ ప్రైమరీ విద ్య ప్రవేశపెట్టే ఆలోచనలు చేస్తున్నారు. అలాగే ప్రతినెలా విద్యాశాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు చేపడతారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, కళాశాల విద్య కమిషనర్ వాణిప్రసాద్, సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీరెడ్డి, జేఎన్టీయూ వీసీ శైలజా రామయ్యార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ పాల్గొన్నారు.
ప్రైవేటు పుస్తకాలు అమ్మే స్కూళ్లపై చర్యలు
ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ నిర్దేశిత సిలబస్‌తో కూడిన పుస్తకాలనే వినియోగించాలి. మే 20నాటికి ఈ పుస్తకాలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను స్కూళ్లలో అమ్ముతున్న పాఠశాలల్లో తనిఖీలు చేసి చర్యలు చేపడతారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యాశాఖ అకడమిక్ కేలండర్ జారీ చేశాకే ప్రవేశాలు చేపట్టాలి. లేదంటే చర్యలు తీసుకుంటారు.