అదిరేటి స్టెప్పు మేమేస్తే..
హైదరాబాద్సిటీ (కాచిగూడ): ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థినులు తమదైన శైలితో స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎం.పద్మాదేవేందర్రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. చదువుకునే రోజుల్లో రెడ్డి కళాశాలలో చదువుకోవాలనే ఆశ ఉండేదని, కాని అది అప్పుడే నేరవేరలేదని, ఇప్పుడు కళాశాలలో అడుగు పెట్టేసరికి నా కల ఈ విధంగా నేరవేరిందని సంతోషాన్ని వ్యక్త పరిచారు.
రెడ్డి కళాశాలకు అవసరమైన సహాయ సహాయసహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని, అవసరమైతే సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. బంగారు తెలంగాణ పునర్నినిర్మాణంలో మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంతెత్తుకు ఎదిగినా కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను ఎన్నటికి మర్చిపోవద్దని సూచించారు. చదువులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్మెడల్స్తో పాటు మెరిట్ సర్టిఫికెట్స్ అందజేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ఫ్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సురేఖారెడ్డి, సెక్రటరీ ప్రోఫెసర్ తిప్పారెడ్డి, డెరైక్టర్ డాక్టర్ డి.రామకృష్ణారెడ్డి, డీన్ ప్రోఫెసర్ ముత్యంరెడ్డి, మంజులత జైన్ తదితరులు పాల్గొన్నారు.