ఐసిస్ టార్గెట్‌లో హిందూ నాయకులు, మసీదులు
దేశంలో ప్రకంపనలు సృష్టించడానికి పలువురు హిందూ నాయకులను ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టార్గెట్ చేసింది. వారితో పాటు.. కొన్ని అహ్మదీయ మసీదులు, జమాతే ఇస్లామీ హింద్ నేతలను కూడా తమ హిట్‌లిస్టులో పెట్టుకున్నట్లు ఇటీవల కేరళలో అరెస్టయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది మొయినుద్దీన్ పరకదావత్ ఎన్ఐఏ విచారణలో వెల్లడించాడు. అహ్మదీయ నాయకులు, జమాతే ఇస్లామీ హింద్ నేతలు ఈమధ్య కాలంలో ఇస్లామిక్ స్టేట్ అకృత్యాలను తీవ్రంగా ఖండించారు. ఇస్లాం శత్రువుల కంటే ముస్లింలకే ఎక్కువ హాని చేస్తున్నారని వాళ్లు మండిపడ్డారు. కేరళకు చెందిన మొయినుద్దీన్‌ను ఫిబ్రవరి 14న అబు దాబి నుంచి డిపోర్ట్ చేసి తీసుకొచ్చి ఎన్ఐఏ వర్గాలు అరెస్టు చేశాయి. భారతదేశంలోని తమ టార్గెట్ల గురించి ఇస్లామిక్ స్టేట్ సభ్యులకు చెందిన రహస్య ఆన్లైన్ గ్రూపులలో తరచు చర్చలు జరుగుతుంటాయని అతడు వెల్లడించాడు.
టెలిగ్రాం యాప్‌లోని గ్రూపులో జరిగిన ఇలాంటి చర్చలోనే.. గత సంవత్సరం కొచ్చిలో జరిగిన జమాతే ఇస్లామీ కార్యక్రమానికి రాహుల్ ఈశ్వర్ అనే హిందువును వక్తగా పిలిచిన విషయం ఒకటి తెలిసింది. ఇలాంటి కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకోవాలని అందులో అన్నారు. ఆ వేదికకు సమీపంలోనే కొచ్చి యూదుల ఆలయం ఒకటి ఉందని తాను చెప్పానని, దాంతో గ్రూపులో ఉన్న ఓ వ్యక్తి బైకును ఉపయోగించి దాడులు చేయాలని సూచించగా, తాను మాత్రం టిప్పర్ లారీ అయితే దాడికి బాగుంటుందని సూచించానని మొయినుద్దీన్ వివరించాడు. ఇక ఇటీవల కేరళ జైలు నుంచి తప్పించుకున్న 22 మంది ఖైదీలు ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నారని, వాళ్లలో ఐదుగురిని ఇరాక్ సరిహద్దుల్లో తాను కలిశానని కూడా చెప్పాడు. తర్వాత అక్కడి నుంచి అబుదాబికి వచ్చిన మొయిన్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేసి, భారతదేశానికి డిపోర్ట్ చేశారు.