తుని ఘటనలో మరో ముగ్గురికి బెయిల్
కాకినాడ : తుని ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రధాన అనుచరులకు బెయిల్ మంజూరు అయింది. జిల్లా కోర్టు సోమవారం ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణులకు బెయిల్ ఇచ్చింది. తుని ఘటనలో అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ, అరెస్ట్ చేసిన వారిని వెంటనే బెయిల్‌పై విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ 12 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కాగా తుని ఘటన కేసులో మొత్తం 13మందికి బెయిల్ మంజూరు కావటంతో ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించే అవకాశం ఉంది.
ఈ ఏడాది జనవరి 31న కాపు ఐక్య గర్జన ఉద్యమంలో భాగంగా తుని సంఘటనకు సంబంధించి 13మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలో లగుడు శ్రీనివాస్, కూరాకుల పుల్లయ్య, గణేషుల రాంబాబు, గణేషుల లక్ష్మణరావు, చక్కపల్లి సత్తిబాబు, పల్లా శ్రీహరిబాబు, దూడల మునీంద్ర, లక్కింశెట్టి గోపీ మహేష్, ముదిగొండ పవన్‌కుమార్, నక్కా సాయి ఇప్పటికే బెయిల్‌పై విడుదల అయ్యారు.