tv series
-
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ 'సీఐడీ' మళ్లీ వస్తోంది!
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో సీఐడీ. ఒళ్లు గగుర్పొడిచే నేరాలు, ఘోరాలు.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చేసే సాహసాలు.. అన్నీ కూడా అద్భుతంగా ఉండేవి. అందుకే అందరూ సీఐడీని ఎంతో ఇష్టపడతారు. శివాజీ సతం, ఆదిత్య శ్రీవాత్సవ, దయానంద్ శెట్టి, నరేంద్ర గుప్త, అన్ష సాయేద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ టీవీ సిరీస్ ఆల్‌టైమ్ హిట్. 1998 నుంచి 2018 వరకు ఈ సిరీస్ కొనసాగింది.తాజాగా సీఐడీ టీమ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి అలరించేందుకు రెడీ అయ్యామని వెల్లడించింది. అక్టోబర్ 26న ప్రోమో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. అయితే దివంగత నటుడు దినేశ్ ఫడ్నీస్ లేకుండా సీక్వెల్ చూడాల్సి వస్తుండటం కొంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కాగా సీఐడీలో ఫెడరిక్గా నటించిన దినేశ్ ఫడ్నీస్ గతేడాది డిసెంబర్లో కన్నుమూశారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) చదవండి: లవ్ రెడ్డి నటుడిపై ప్రేక్షకురాలి దాడి -
మైకేల్ జాక్సన్ తీన్మార్
హిందీ ఫోక్ సాంగ్‌కు మైకేల్ జాక్సన్ ఆయన స్టైల్లోనే డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది కాదు... అసలు ఎలా వీలవుతుంది?! అంటారా. సాంకేతిక మాయాబజార్లో ఏదైనా సాధ్యమే. కామెడి డ్రామా స్ట్రీమింగ్ టీవీ సిరీస్ ‘పంచాయత్’కు సంబంధించి మీమ్స్, వైరల్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి మైకేల్ జాక్సన్ డ్యాన్స్ వీడియో. ఈ ఫ్యాన్–మేడ్ వీడియో 8 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోలో ‘ఏ రాజాజీ రాజాజీ’ అనే పాటకు మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. అయితే ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. చాలా సహజంగా ఉండడమే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం అయింది. -
గన్ షాట్‌తో చనిపోయిన నటుడు.. హత్య ? ఆత్మహత్య ?
హాలీవుడ్ పాపులర్ టీవీ సిరీస్‌లలో ఒకటి 'ది వాకింగ్ డెడ్'. ఇందులో 'పెట్ జాంబీ'గా అద్భుతంగా నటించిన మోసెస్ జె. మోస్లీ అకాల మరణం చెందాడు. 31 ఏళ్ల మోసెస్ ఈ ఏడాది జనవరిలో మరణించాడు. పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యులు మోసెస్ తుపాకీ గాయం కారణంగా చనిపోయడని తెలిపారు. అయితే మోస్లీ ప్రమాదవశాత్తు మరణించాడా ? ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను మరణించిన ప్రదేశంలో ఒక లేఖను కూడా పోలీసులు కనుగొన్నట్లు సమాచారం. పోలీసులు మోసెస్ జె. మోస్లీ మృతదేహాన్ని జార్జియాలోని ఓ పార్కింగ్ లాట్లో కనిపెట్టారు. మోసెస్ చనిపోయిన నెలకు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్స్ రావడం గమనార్హం. మోసెస్ మృతిపట్ల అవేరి సిస్టర్స్ ఎంటర్టైన్మెంట్ నివాళి అర్పించింది. తన అధికారిక ఫేస్బుక్ పేజీలో సంతాపం తెలుపుతూ పోస్ట్ పెట్టింది. అనేక మంది సెలబ్రిటీలు మోసెస్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మోసెస్ 'పెట్ జాంబీ' పాత్రలో మూడేళ్లు 'ది వాకింగ్ డెడ్' సిరీస్‌లో నటించాడు. వాచ్మెన్, టేల్స్, అమెరికన్ సోల్, క్వీన్ ఆఫ్ ది సౌత్ వంటి సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. అలాగే లూజ్ స్క్రూస్, అటాక్ ఆఫ్ ది సౌతెర్న్ ఫ్రైడ్ జాంబీస్, డాల్ మర్డర్ స్ప్రీ వంటి మూవీస్‌లలో అలరించాడు. మోసెస్ జె. మోస్లీ చివరిగా నటించిన హాంక్, డిసెండింగ్ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. -
ఆకట్టుకుంటున్న మార్వెల్ ‘హాక్ ఐ’ ట్రైలర్
హాలీవుడ్ సినిమాల్లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్(ఎమ్‌సీయూ) మూవీస్‌కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎమ్‌సీయూ నుంచి 2019లో వచ్చిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. జేమ్స్ కామెరూన్ ఫాంటసీ మూవీ ‘అవతార్’ని దాటి ప్రపంచంలోనే అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా అవెంజర్స్ నిలిచింది. ఆ ఫ్రాంఛైజీలో ఇప్పటికే 25కి పైగా సినిమాలు, కొన్ని టీవీ సిరీస్‌లు రిలీజై ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తాజాగా ఆ ఎమ్‌సీయూ నుంచి వస్తున్న మరో టీవీ సిరీస్ ‘హాక్ ఐ’. దీనికి సంబంధించి ఇంగ్లీష్ ట్రైలర్ సోమవారం (సెప్టెంబర్ 13న) విడుదలైంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ తర్వాత నుంచి కథ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్వెల్ మూవీస్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాగా ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 24న విడుదల కానుంది. అయితే ఇటీవల ఈ ఫ్రాంఛైజీ నుంచి ‘షాంగ్ చీ: ది లెజెండ్ ఆఫ్ టెన్ రింగ్స్’ విడుదలై ఎమ్సీయూలోనే బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. -
వరల్డ్ ఫేమస్ దొంగల ముఠా.. ప్రతీదీ ట్విస్టే!
ఎంటర్టైన్మెంట్కి ఎల్లలు లేవు. అందుకే లోకల్ కంటెంట్‌తో పాటు గ్లోబల్ కంటెంట్‌కు ఆదరణ ఉంటోంది. ఇక ఓటీటీ వాడకం పెరిగాక.. దేశాలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్‌లను డిజిటల్ తెరలపై చూసేస్తున్నారు మనవాళ్లు. ఆ లిస్ట్‌లో ఒకటే ‘మనీ హెయిస్ట్’. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ టీవీ సిరీస్‌కి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్.. అందులో తెలుగువాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కువమంది(ఇండియన్స్‌తో సహా) చూసిన నాన్–ఇంగ్లీష్ సిరీస్ కూడా ఇదే(ఇదొక రికార్డు). మనీ హెయిస్ట్కి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ప్రధాన కారణాలు.. ఈ సిరీస్ మూలకథ, ప్రధాన పాత్రలతో వ్యూయర్స్ పెంచుకున్న కనెక్టివిటీ. అందుకే ఐదో పార్ట్ రూపంలో అలరించేందుకు సిద్ధమైంది ఈ దొంగల ముఠా డ్రామా. సాక్షి, వెబ్‌డెస్క్: క్రైమ్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవాళ్లకు ‘మనీ హెయిస్ట్’ ఒక ఫుల్ మీల్స్. ఒరిజినల్‌గా ఇది స్పానిష్ లాంగ్వేజ్‌లో తెరకెక్కింది. నాన్–స్పానిష్ ఆడియెన్స్ కోసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో సిరీస్‌ను అందిస్తున్నారు. మొదటి సీజన్ 2017 మే 2న స్పానిష్ టీవీ ఛానెల్ ‘అంటెనా 3’ లో టెలికాస్ట్ అయ్యింది. స్పానిష్‌లో మనీ హెయిస్ట్ ఒక టెలినోవెలా.. అంటే టెలిసీరియల్ లాంటిదన్నమాట. మనీ హెయిస్ట్ టెలికాస్ట్ తర్వాత.. అప్పటిదాకా ఉన్న స్పానిష్ టీవీ వ్యూయర్షిప్ రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఆ పాపులారిటీని గుర్తించి నెట్‌ఫ్లిక్స్ మనీ హెయిస్ట్ రైట్స్‌ని కొనుగోలు చేసింది. అలా నెట్‌ఫ్లిక్స్ నుంచి ప్రపంచం మొత్తం ఈ ట్విస్టీ థ్రిల్లర్‌కు అడిక్ట్ అయ్యింది. మరో రికార్డ్ ఏంటంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్షిప్ ఉన్న టీవీ సిరీస్ కూడా ఇదే!. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్లో ఐదో పార్ట్‌గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు వాల్యూమ్స్(ఎపిసోడ్స్‌గా) రిలీజ్ కానుంది. ఆ పై డిసెంబర్లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనే ఎగ్జయిట్మెంట్ ఫ్యాన్స్‌లో మొదలైంది. ఎందుకంత అడిక్షన్? మనీ హెయిస్ట్ ఒరిజినల్(స్పానిష్) టైటిల్ ‘లా కాసా డె పాపెల్’. బ్యాంకుల దోపిడీ(హెయిస్ట్) నేపథ్యంలో సాగే కథ ఈ సిరీస్‌ది. దోపిడీకి ప్రయత్నించే గ్యాంగ్.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూసే పోలీసులు.. వెరసి ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌తో కథ ముందుకెళ్తుంది. అలాగని స్టోరీ నార్మల్‌గా ఉండదు. సీన్‌కి సీన్‌కి ఆడియెన్స్‌లో హీట్ పెంచుతుంది. ట్విస్టుల కారణంగా ‘ప్రతీ సీన్ ఒక క్లైమాక్స్‌లా’ అనిపిస్తుంది. కథలో తర్వాతి సీన్ ఏం జరుగుతుందనేది వ్యూయర్స్ అస్సలు అంచనా వేయలేరు. ఆ ఎగ్జయిట్మెంటే చూసేవాళ్లను సీటు అంచున కూర్చోబెడుతుంది. కథలో ఒక్కోసారి ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ వస్తుంటాయి. వాటి ఆధారంగానే కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఆడియెన్స్‌ని ప్రధానంగా ఆకట్టుకునే అంశం కూడా ఇదే. ఇక స్క్రీన్‌ప్లే సైతం గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ చెప్పే డైలాగులు ఫిలసాఫికల్ డెప్త్‌తో ఉంటాయి. అందుకే ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యారంటే వదలకుండా చూస్తుంటారు. ఈ సిరీస్‌కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ట్విట్టర్లో ఒకటి, రెండు రోజులు ట్రెండింగ్‌లో ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు మనీ హెయిస్ట్ క్రేజ్ ఏపాటిదో. క్యారెక్టర్స్ కనెక్టివిటీ కాస్టింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు.. ప్రతీ క్యారెక్టర్‌కి కరెక్ట్ సీన్లు పడటం కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ, మనీ హెయిస్ట్‌లో ప్రతీ క్యారెక్టర్‌కి సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్యారెక్టర్లను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. ఈ కథ నారేటర్, దోపిడీ ముఠాలో ఫస్ట్ మెంబర్ ‘టోక్యో’. ఇక మెయిన్ క్యారెక్టర్ ‘ఎల్’ ఫ్రొఫెసర్. దోపిడీ వెనుక మాస్టర్ మైండ్ ఇతనే. నిజానికి అతని యాక్చువల్ ప్లాన్ వేరే ఉంటుంది. ప్రొఫెసర్‌తో పాటు నైరోబీ, బెర్లిన్(ప్రొఫెసర్ బ్రదర్) అనే మరో రెండు క్యారెక్టర్లు టోటల్‌గా ఈ సిరీస్‌కే కిరాక్ పుట్టించే క్యారెక్టర్లు. అందుకే వాటికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అసలు కథ విషయానికొస్తే.. ఆరంభంలో ఒక బ్యాంక్ దొంగతనం చేయబోయి ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతుంది ఒలివెయిరా(టోక్యో). ఆమెను పోలీసుల బారి నుంచి రక్షిస్తాడు ప్రొఫెసర్. ఆమెతో పాటు మరో ఏడుగురిని ఒకచోట చేర్చి భారీ దోపిడీలకు ప్లాన్ గీస్తాడు. ఆ ముఠాలో ప్రొఫెసర్ బ్రదర్ అండ్రెస్ డె ఫోనోల్లోసా(బెర్లిన్) కూడా ఉంటాడు.ఆ గ్యాంగ్‌లో ఒకరి వివరాలు ఒకరికి తెలియవు. కానీ, ఎక్కడో దూరంగా ఉండి ప్రొఫెసర్ ఇచ్చే సూచనల మేరకు పని చేస్తుంటారు. పోలీసుల నుంచి రక్షించుకునే క్రమంలో జరిగే పోరాట సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ క్రమంలో వాడే మోడరన్ టెక్నాలజీ, వెపన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. మధ్యమధ్యలో క్యారెక్టర్ల రిలేషన్స్, ఎమోషన్స్, లవ్ ట్రాక్స్.. ఇలా కథ సాగుతూ పోతుంటుంది. కథలో ప్రతీ క్యారెక్టర్‌ను వ్యూయర్స్ ఓన్ చేసుకున్నారు కాబట్టే.. అంతలా సూపర్ హిట్ అయ్యింది ఈ సిరీస్. సాల్వడోర్‌కు గౌరవసూచికంగా.. మనీ హెయిస్ట్ కథలో మరో ప్రధాన ఆకర్షణ.. క్యారెక్టర్ల పేర్లు. ముఠాలోని సభ్యులకు ఒరిజినల్ పేర్లు వేరే ఉంటాయి. వాళ్ల ఐడెంటిటీ మార్చేసే క్రమంలో వివిధ దేశాల రాజధానుల పేర్లు పెడతాడు ప్రొఫెసర్. టోక్యో, మాస్కో, బెర్లిన్, నైరోబీ, స్టాక్‌హోమ్, హెల్సెంకీ... ఇలాగన్నమాట. ఒకరకంగా ఈ పేర్లే మనీ హెయిస్ట్ను ఆడియెన్స్‌కి దగ్గర చేశాయి.. హయ్యెస్ట్ వ్యూయర్షిప్తో బ్రహ్మరథం పట్టేలా చేశాయి. కథలో ఆకట్టుకునే విషయం దోపిడీ ముఠా ధరించే మాస్క్‌లు. ఈ మాస్క్‌లకూ ఒక ప్రత్యేకత ఉంది. స్పానిష్ ప్రముఖ పెయింటర్ సాల్వడోర్ డాలి. ఆయన గౌరవార్థం.. ఆయన ముఖకవళికలతో ఉన్న మాస్క్‌ను ఈ సిరీస్‌కు మెయిన్ ఎట్రాక్షన్ చేశాడు ‘లా కాసా డె పాపెల్’ క్రియేటర్ అలెక్స్ పీనా. ఈ టీవీ షో తర్వాతే అలెక్స్ పీనా పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. ఆయనకి బడా ఛాన్స్‌లు తెచ్చిపెట్టింది. ఊపేసిన బెల్లా చావ్ మనీ హెయిస్ట్ థీమ్ మ్యూజిక్ కంటే.. ఈ సిరీస్ మొత్తంలో చాలాసార్లు ప్లే అయ్యే పాట బెల్లా సియావో(బెల్లా చావ్)కి ఒక ప్రత్యేకత ఉంది. బెల్లా సియావో ఒక ఇటాలియన్ జానపద గేయం. ఇంగ్లీష్‌లో దానర్థం ‘గుడ్‌బై బ్యూటిఫుల్’ అని. పాత రోజుల్లో ఇటలీలో మాండినా(సీజనల్ వ్యవసాయ మహిళా కూలీలు) తమ కష్టాల్ని గుర్తించాలని భూస్వాములకు గుర్తు చేస్తూ ఈ పాటను పాడేవాళ్లు. 19వ శతాబ్దం మొదట్లో నార్త్ ఇటలీలో వ్యవసాయ కూలీలు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేవాళ్లు. ఆ టైంలో ఈ పాట ఉద్యమ గేయంగా ఒక ఊపు ఊపింది. 1943–45 టైంలో యాంటీ–ఫాసిస్టులు ఈ పాటను ఎక్కువగా పాడేవాళ్లు. ఆ తర్వాత ఈ పాట వరల్డ్ కల్చర్‌లో ఒక భాగమైంది. చాలా దేశాల్లో రీమేక్ అయ్యింది. 1969 నుంచి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా బెల్లా సియావో ఒక భాగమైంది. కానీ, మోస్ట్ పాపులర్ సాంగ్‌గా గుర్తింపు పొందింది మాత్రం మనీ హెయిస్ట్ సిరీస్‌తో. మెయిన్ క్యారెక్టర్స్ ఎల్ ప్రొఫెసర్, బెర్లిన్(అన్నదమ్ములు) కలిసి పాడిన ఈ పాట తర్వాత సీజన్ల మొత్తం నడుస్తూనే ఉంటుంది. 2018 సమ్మర్లో ‘బెల్లా సియావో’ యూరప్‌లో ఒక చార్ట్బస్టర్సాంగ్గా గుర్తింపు పొందింది. తెలుగులో మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’లో.. ‘పిల్లా.. చావే...’ సాంగ్ దీని నుంచే స్ఫూర్తి పొందిందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. -
డిజిటల్ ఎంట్రీకి రెడీ
రణ్‌బీర్ కపూర్ వెబ్ ఎంట్రీకి రెడీ అయ్యారనే వార్తలు బాలీవుడ్లో షికారు చేస్తున్నాయి. హాలీవుడ్ నటుడు టామ్ హిడిల్స్టన్ నటించిన టీవీ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ వెర్షన్లో నటించనున్నారట రణ్‌బీర్. ఇంగ్లిష్‌లో విజయం సాధించిన ఈ కథ ఆధారంగా హిందీలో 10 ఎపిసోడ్స్ నిర్మించనున్నారని సమాచారం. కొన్ని వారాల క్రితమే ఈ సిరీస్‌లో నటించడానికి రణ్‌బీర్ అధికారికంగా సైన్ చేశారని టాక్. అయితే దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలి? అనే ఆలోచనలో ఉందట ఈ వెబ్ సిరీస్‌ని నిర్మించనున్న డిస్నీ హాట్‌స్టార్ సంస్థ. భారీబడ్జెట్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ కథను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని లొకేషన్లలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ప్రస్తుతం రణ్‌బీర్ మల్టీస్టారర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’, ‘షంషేరా’లతో పాటు మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌కు డేట్లను సర్దుబాటు చేసే పనిలో పడ్డారట రణ్‌బీర్ కపూర్. -
శిక్షణ ముగిసింది
స్టంట్స్ చేయడానికి శిక్షణ పూర్తి చేసుకున్నారు శ్రుతీహాసన్. ఇక వాటిని స్క్రీన్ మీద చూపించడమే ఆలస్యం అంటున్నారామె. ‘ట్రెడ్‌స్టోన్’ అనే అమెరికన్ టీవీ సిరీస్‌లో యాక్ట్ చేయనున్నారు శ్రుతీ. తన పాత్రకు సంబంధించి చాలా యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుందట. దానికోసం కొంత కాలంగా హంగేరీలోని బుడాపెస్ట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ పూర్తికావడంతో షూటింగ్‌కు రెడీ అయ్యారు. ‘‘చాలా ఏళ్ల తర్వాత నాలో శక్తిని మళ్లీ బయటకు తీసుకు వచ్చారు నా ట్రైనర్ జిల్వీ. తనతో ట్రైనింగ్ చాలా సరదాగా సాగింది’’ అని పేర్కొన్నారు శ్రుతీ. ఈ షూటింగ్లో జాయిన్ అవడానికి తైవాన్ వెళ్లారు శ్రుతీ. ఈ సిరీస్‌లో పగలంతా వెయిట్రెస్‌గా పని చేస్తూ రాత్రి హత్యలు చేసే వ్యక్తి పాత్రలో శ్రుతీ కనిపిస్తారు. -
దేశీ గేమ్ ఆఫ్ థ్రోన్స్
ఇంగ్లీష్ టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ఎంత క్రేజ్ ఉందో హాలీవుడ్‌ను కొంచెం ఫాలో అయ్యేవాళ్లను కదిలించినా చెబుతారు. ఇప్పుడు ఇలాంటి సిరీస్‌నే ఇండియాకు తీసుకురానున్నారట బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్. ఎప్పటికప్పుడు టీవి, డిజిటల్, సిల్వర్ స్క్రీన్ పై కొత్త ఐడియాలు, సరికొత్త షోలు, న్యూ ఏజ్ సినిమాలు అందించే ఏక్తా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు దేశీ వెర్షన్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్ టాక్. హాలీవుడ్ వెర్షన్‌కు ఇండియాలో పెరుగుతున్న క్రేజ్ చూసిన ఏక్తా.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి సిమిలర్ ఐడియాతో దేశీ వెర్షన్ రూపొందించాలనుకుంటున్నట్లు ఏక్తా సన్నిహితులు అంటున్నారు.. మరి దేశీ వెర్షన్ వస్తుందా? వేచి చూద్దాం. -
మూడువేల కోట్ల బడ్జెట్...
‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ హాలీవుడ్ చరిత్రలోని అద్భుతాల్లో ఒకటి. ఈ ఫిల్మ్ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ను దోచేసుకొని ఇంటికి తీసుకెళ్లాయి. అలాగే అవార్డులను కూడా. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్‌గా టీవీ సిరీస్ వస్తోంది. నిజమే. సినిమా కాదు.. టీవీ సిరీస్. గత దశాబ్ద కాలంలో హాలీవుడ్లో టీవీ సిరీస్ బిజినెస్ అమాంతంగా పెరిగిపోవడంతో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు బడ్జెట్ స్థాయిని కూడా ఎంతంటే అంత పెంచేస్తున్నాయి. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ ప్రీక్వెల్ కోసం అమెజాన్ 500 మిలియన్ డాలర్లు (సుమారు మూడువేల రెండొందల యాభై కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తోందట. ఇందులో 250 మిలియన్ డాలర్లు కేవలం కథ రైట్స్ కోసమే వెచ్చించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ టీవీ సిరీస్ ఉంది. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన సిరీస్, అంత రిటర్న్స్ తెచ్చుకుంటుందా? సినిమాల్లోలానే టీవీ సిరీస్‌లోనూ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రికార్డులు సృష్టిస్తుందా? చూడాలి. -
బుల్లితెరపై బిల్ గేట్స్
హాలీవుడ్ లో అత్యంత ప్రజాధరణ పొందిన టీవీ సీరీస్ గా గుర్తింపు తెచ్చుకున్న ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ తాజా సీరీస్‌లో ఓ ప్రముఖ వ్యక్తి అతిథి పాత్రలో నటించనున్నారు. దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ ఈషోలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆయన షోలోనూ తన నిజ జీవిత పాత్ర బిల్గేట్స్గానే కనిపించనున్నారట. కార్యక్రమంలో భాగంగా జరిగే ఓ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. బిల్‌గేట్స్ తో పాటు ఈ షోలో స్టీఫెన్ హాకింగ్స్, స్టాన్లీలు కూడా అతిథులుగా కనిపించనున్నారు. ఈ కార్యక్రమం వచ్చే నెలలో ప్రసారం కానుంది. బిల్ గేట్స్ 2001లోనూ ఫ్రైసర్ అనే టీవీ షోలో నటించారు. ఇప్పటికే ‘ది బిగ్ బ్యాంగ్ థియరీ’ పదకొండు సీజన్ లు పూర్తి చేసుకుంది. 12వ సీజన్ మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో పలువురు ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. -
ఫైనల్ గేమ్ 2019లోనే!
2011లో మొదలైన ఒక సంచలనం ఏడేళ్లుగా అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. ఆ సంచలనం పేరే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’. 2011లో మొదలైందీ టీవీ సిరీస్. ఒక్కో ఏడాది ఒక్కో సీజన్‌తో ఇప్పటికి ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ని అభిమానులు ముద్దుగా ‘జీఓటీ’ అని పిలుచుకుంటారు. కోట్లల్లో ఉన్న అభిమానులు, సినిమాలకు మించి ఉన్న క్రేజ్, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, కట్టిపడేసే కథ.. ఇవన్నీ కలిపి జీఓటీకి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. గతేడాది వచ్చిన సీజన్ 7 అయితే అభిమానులకు ఒక పండగలానే వచ్చి వెళ్లింది. సీజన్ 7 అయిపోవడమే అభిమానులంతా సీజన్ 8 కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇండియన్ సినిమా అభిమానులకు కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ పిచ్చి పట్టిందంటే, అది గత రెండేళ్లుగానే! సీజన్ 8కు ఉన్న క్రేజ్‌కు మరో కారణం అంటే అది చివరి సీజన్ కావడం కూడా! సీజన్ 8తో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్ అయిపోతుంది. దీంతో ఇప్పటివరకూ చూసిన అన్ని సీజన్స్లోకి ది బెస్ట్ అనిపించేలా ఇప్పుడొచ్చే సీజన్ ఉండాలని ప్లాన్ చేస్తోంది టీమ్. ఈ క్రమంలోనే 2018లోనే సీజన్ 8ను ప్లాన్ చేసినా ఇప్పుడది 2019కి షిఫ్ట్ అయింది. ఇప్పటివరకూ 2011 నుంచి ఏడేళ్లుగా ప్రతి ఏడాదీ ఒక సీజన్ వచ్చింది. ఇప్పుడు సీజన్ 8.. 2019కి వెళ్లిపోవడంతో ఫస్ట్‌టైమ్ బ్రేక్ వచ్చినట్టు. అయితే ఆ బ్రేక్ తీస్కోవడానికి కూడా కారణం ఉందట. ఫైనల్ గేమ్ మేకింగ్‌కు మరి ఆ మాత్రం టైమ్ పడుతుంది. ఎంత లేటైనా ఎండింగ్ అదిరిపోవాలి అని!! -
బాహుబలి టీవీ సీరీస్ వచ్చేస్తోంది..!
ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న బాహుబలి త్వరలో బుల్లితెర వీక్షకులను కూడా అలరించనుంది. తొలి భాగం రిలీజ్ సమయంలోనే బాహుబలి టీవీ సీరీస్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముగియటంతో ఇప్పుడు టీవీ సీరీస్ మీద దృష్టి పెట్టారు. ఈ మేరకు బాహుబలి టీవీ సీరీస్‌పై చిత్రయూనిట్ ఓ ప్రకటన చేసింది. బాహుబలి టీవీ సీరీస్‌ను ముందుగా హిందీలో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం బాహుబలి మార్కెట్ స్పాన్ భారీగా పెరగటంతో ముందుగా హిందీలో తెరకెక్కించి తరువాత ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాగా వచ్చిన కథ కాకుండా రైజ్ ఆఫ్ శివగామి.. లేదా బాహుబలి కన్‌క్లూజన్ తరువాతి పరిణామాల నేపథ్యంలో టీవీ సీరీస్ తెరకెక్కనుంది. ఈ సీరీస్‌ను 10 నుంచి 13 ఎపిసోడ్స్‌గా రూపొందించనున్నారు.