పెరిగిన నగదు లావాదేవీలు
► తగ్గిన డిజిటల్ చెల్లింపులు
► ఎన్పీసీఐ సీఓఓ దిలీప్ వెల్లడి
ముంబై: నగదు వినియోగం మళ్లీ పెరిగిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) పేర్కొంది.పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా 5 కోట్ల మంది కొత్తగా డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు జరిపారని ఎన్పీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దిలీప్ అస్బే చెప్పారు. వీరిలో 3 కోట్ల మంది వరకూ డిజిటల్ చెల్లింపులను కొనసాగిస్తున్నారని వివరించారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా పది కోట్ల మంది డిజిటల్, నగదు రహిత లావాదేవీలు జరిపారని, ఆ తర్వాత పలువురు నగదు వినియోగానికే మరలిపోయారని పేర్కొన్నారు.
కొత్తగా 3–3.5 కోట్ల మంది డిజిటల్ చెల్లింపులు చేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని వివరించారు. ఈ ఏడాది జనవరిలో డిజిటల్ లావాదేవీలు 9 శాతం, ఫిబ్రవరిలో 21 శాతం చొప్పున తగ్గాయని పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీల జోరు పెంచడానికి ప్రజల్లో మరింతగా అవగాహనను పెంచాల్సి ఉందని వివరించారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ)కు పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, వచ్చే ఏడాది పేటెంట్ పొందగలమని తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఆధార్ పేలో మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) ప్రస్తుతమున్నట్లుగానే(రూ.2,000 లోపు 0.25 శాతం) ఉంటుందని వివరించారు. భారత్ క్యూఆర్ కోడ్, యూపీఐ క్యూఆర్ కోడ్ విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.