వీవీఐపీలు తెలుసంటూ కో ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే..
హైదరాబాద్:
సినీ రంగంలో కో–ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఓ ప్రబుద్ధుడు వీవీఐపీల పేర్లు చెప్పి అనేక మంది ప్రముఖుల్ని ‘ఇష్టం వచ్చినట్లు వాడేశాడు’. ఉద్యోగాలకు పైరవీ నుంచి సినిమా టిక్కెట్ల వరకు ‘వినియోగించుకున్నాడు’. ఇద్దరు నిరుద్యోగులకు ఢిల్లీలో ఉద్యోగాల పేరుతో భారీగా దండుకున్నాడు. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన వంగ ఆనంద్‌బాబు నగరానికి వచ్చి ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో స్థిరపడ్డాడు. సినీ రంగంలో కో–ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న ఇతగాడు.. తన స్వస్థలానికి వెళ్లినప్పుడల్లా పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ డాంబికాలకు పోయేవాడు.
కొన్నాళ్లకు ‘ఈ పరిచయాలనే’ క్యాష్ చేసుకోవాలని భావించాడు. తన స్నేహితురాలి పేరుతో ఓ సిమ్‌కార్డు తీసుకున్న ఆనంద్‌బాబు వెబ్సైట్లు, డైరెక్టరీల ఆధారంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు, వారి హోదాలు తెలుసుకున్నాడు. వారి మాదిరిగానే ప్రముఖులకు ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పంపించడం మొదలెట్టాడు. ఉద్యోగాలకు సిఫార్సులు, పోస్టింగ్స్‌తో పాటు తిరుమలలో దర్శనాలు, అనేక ప్రాంతాల్లో బసలు ఆ ప్రముఖులతోనే ఏర్పాటు చేయించుకున్నాడు. చివరకు కొందరు అధికారులకు సదరు ప్రముఖుడిగా ఫోన్లు చేసి తన వాళ్ళు వస్తున్నారంటూ సినిమా టిక్కెట్లు సైతం సిద్ధం చేయించుకుని తన స్నేహితురాలితో కలిసి వెళ్ళేవాడు.
ఆనంద్‌బాబు ఇప్పటి వరకు ప్రధానమంత్రి కార్యాలయం అదనపు సెక్రటరీ ఏకే శర్మ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావు తదితర పేర్లు వాడుకున్నాడు. ఈ పేర్లతో వివిధ జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరెంటెండెంట్లతో పాటు ఉన్నతాధికారులనూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇద్దరు నిరుద్యోగులకు ఢిల్లీలోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉన్నతోద్యోగాలు ఇప్పిస్తాంనంటూ భారీగా దండుకున్నాడు. ఇతడి వ్యవహారాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందింది. ఏసీపీ కేసీఎస్ రఘువీర్ ఆదేశాలతో ఇన్స్పెక్టర్ బి.చాంద్‌బాష, ఎస్సై బి.మధుసూదన్ వలపన్ని అరెస్టు చేశారు. ఇతగాడి మోసాలను పూర్తిస్థాయిలో గుర్తించడానికి న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ అధికారులు నిర్ణయించారు.