నత్తనడకన ప్రజా సాధికార సర్వే
రోజుకో వెర్షన్ మార్పు
కాకినాడ సిటీ:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వేను సాంకేతిక సమస్యలు వీడడం లేదు. దాంతో అది నత్తనడకన సాగుతోంది. మరో వంక తొలివిడత సర్వే ముగింపు గడువు ఈనెల 30వ తేదీ ముంచుకొస్తోంది. ఈనెల 8వ తేదీన ప్రారంభమైన ఈసర్వేకు సాంకేతిక సమస్యలు నేటికీ ఎదురవుతూనే ఉన్నాయి. సర్వర్ ఇబ్బందులతో ట్యాబ్‌లు మొరాయించడం, సర్వర్ కనెక్టవిటీ పూర్తి స్థాయిలో అందకపోవడంతో ఒక్కో కుటుంబం వద్ద గంటకు పైగా సమయం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఈనెల 30వ తేదీ నాటికి తొలివిడత ప్రాంతాల్లో సర్వే ఏమేరకు పూర్తవుతుందో తెలియదు. మరోపక్క ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తీసుకువస్తోంది. తొలుత 2.1 వెర్షన్ రూపొందించింది. తరువాత ఆన్లైన్ ఫార్మెట్లో మార్పులు చేసి 2.2 వెర్షన్ సాఫ్ట్‌వేర్‌ను సర్వే ప్రారంభంలో తీసుకువచ్చింది. తరువాత ఏడుసార్లు మార్పులు చేసి తాజాగా 2.4.2 వెర్షన్ సాఫ్ట్‌వేర్‌లో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇలా రోజుకో వెర్షన్ మారుస్తుండడంతో క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేటర్లు వివరాల సేకరణలో తలెత్తుతున్న ఇబ్బందులతో తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం డివిజన్ల పరిధిలోని 38 రూరల్ మండలాలు, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి రెండు కార్పొరేషన్లు, 7 మున్సిపాల్టీలు, 3 నగర పంచాయతీల్లోని 2795 బ్లాకులలో సుమారు 11 లక్షల కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉంది. కాగా శనివారం వరకు కేవలం 15,607 కుటుంబాల వివరాలను మాత్రమే సేకరించారు. 38 రూరల్ మండలాల్లో 13,629 కుటుంబాల వివరాలు సేకరించారు. అత్యల్పంగా కోటనందూరు మండలంలో 36 కుటుంబాల వివరాలు సేకరించారు. తుని మండలంలో 67, రావులపాలెంలో 91కుటుంబాల వివరాలు తీసుకోగా మిగిలిన మండలాల్లో వందల సంఖ్యలోనే కుటుంబాల వివరాలు సేకరించారు. అర్బన్ ప్రాంతాలల్లో అయితే సర్వే అసలు ముందుకు వెళ్లలేదు. మొత్తం 2,345 కుటుంబాల వివరాలు సేకరించగా అత్యల్పంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో కేవలం 13 కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించారు. రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్లు, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, తుని మున్సిపాల్టీల్లో మూడంకెల సంఖ్యకు చేరుకోగా పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మున్సిపాల్టీలు, గొల్లప్రోలు, ముమ్మిడివరం నగర పంచాయతీలలో రెండంకెల సంఖ్యలో కుటుంబాల వివరాలను సేకరించారు.