డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన ఆంధ్రాబ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీరేట్లను ఆంధ్రాబ్యాంక్ తగ్గించింది. రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై పావు శాతం నుంచి అరశాతం వరకు వడ్డీరేట్లను తగ్గించింది. 2-3 ఏళ్ల కాలపరిమితి గల కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లను 9 నుంచి 8.75 శాతానికి తగ్గించింది.
ఇదే కాలపరిమితి గల కోటి నుంచి రూ. 10 కోట్ల డిపాజిట్లపై వడ్డీరేట్లును 8.75 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గాయి. మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితి గల కోటి రూపాయల లోపు డిపాజిట్లపై వడ్డీరేట్లును 8.75 శాతం నుంచి 8.5 శాతానికి, అదే కోటి నుంచి రూ. 10 కోట్ల డిపాజిట్లపై రేట్లను 8.75 శాతం నుంచి 8.25 శాతానికి తగ్గించింది. 6వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి.
అలహాబాద్ బ్యాంక్ కూడా...
అలహాబాద్ బ్యాంక్ రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 0.15 శాతం వరకూ తగ్గించింది. ఏడాది నుంచి ఐదేళ్ల కాల శ్రేణిలో డిపాజిట్లపై 0.15 శాతం రేటు తగ్గించింది. దీని ప్రకారం ఈ రేటు 8.90 శాతానికి తగ్గుతుంది. 10వ తేదీ నుంచీ కొత్త రేటు అమల్లోకి వస్తుంది.