అడుగంటుతున్న ఆశలు
సాక్షి, తిరుపతి:జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోంది. సగటున ఒకరికి రోజుకు 135 లీటర్ల నీరు అవసరం. అందులో తాగునీరు పది లీటర్లమేర అవసరం ఉంది. ఈలెక్కన జిల్లాలోని 22 లక్షల మంది జనాభాకు రోజుకు 2.97 కోట్ల లీటర్లు అవసరం. తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుంగనూరు, పుత్తూరు, పలమనేరు, నగరి మున్సిపాలిటీలతో పాటు 36 మండలాల పరిధిలోని 432 గ్రామాలకు కలిపి 1.17 కోట్ల లీటర్ల నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
నగరాలు, పట్టణాలు మినహా గ్రామాలకు బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 21 మండలాల్లో తాగునీటి ఎద్దడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులో 18 మండలాల్లో ప్రమాదస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. జిల్లాలో 30వేలకు పైగా తాగునీటి బోర్లు ఉన్నాయి. వీటిలో ఆర్డబ్ల్యూఎస్ కింద 18వేల బోర్లు ఉన్నారుు. వీటిలో అనేక బోర్లలో నీటి చుక్క కనిపించడం లేదు. ఒక్క శాంతిపురం మండలంలో 204 బోర్లు ఉంటే, అందులో 114 బోర్లు ఎండిపోయూరుు. కొన్ని చోట్ల వ్యవసాయబోర్లు, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. కొన్నిప్రాంతాల్లో రెండు, మూడు రోజులకోసారి సరఫరా చేస్తుంటే, మరి కొన్ని ప్రాంతాల్లో సరఫరా చేస్తున్న దాఖలాలే లేవు. రోజూ కిలో మీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నగరాలు, పట్టణాల్లో నాలుగైదురోజులకొకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేచోట మహిళలు కొట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
శాశ్వత నీటి వనరులేవీ...
జిల్లాలో మంచినీటి సరఫరా కోసం శాశ్వత నీటి వనరులు లేకపోవడం గమనార్హం. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, ఎండిపోయాయి. మరో వైపు విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాల మట్టం నానాటికీ పడిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 36 మండలాల్లో సుమారు 3 లక్షలకుపైగా పవర్బోర్లు వేయడంతో ప్రభుత్వం డార్క్ ఏరియాగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం జిల్లాలో సగటున భూగర్భ జలమట్టం 12.68 మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 21 మండలాల్లో 20 మీటర్ల కంటే లోతుకు పడిపోయినట్లు తెలుస్తోంది. అందులో 18 మండలాలను డీప్లెవల్ ప్రాంతాలుగా పరిగణించారు. భూగర్భ జలాల అభివృద్ధికి జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా) ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ పనులు నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. 35 మండలాల్లో రూ.237 కోట్లతో 47 మెగా వాటర్షెడ్స్ ప్రాజెక్టుల కింద అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
సా.. గుతున్న సేద్యం
ఎన్నడూ లేని విధంగా సాగు విస్తీర్ణం పడిపోయింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 64,060 హెక్టార్లైతే.. సాగైంది 53,628 హెక్టార్లే. గత ఏడాది 55,095 హెక్టార్లలో పంటలు సాగుచేశారు. ఏటా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. నీటి కాలుష్యం కూడా సమస్యకు మరో కారణంగా చెప్పొచ్చు. నగరిలో బట్టలకు అద్దే రంగుల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతుండడంతో సత్రవాడ, రామాపురం పరిధిలో బోర్లువేసి చాలీచాలని నీటిని సరఫరా చేస్తున్నారు. ఏర్పేడు మండల పరిధిలోని చెన్నంపల్లె, పెన్నగడ, కొత్తకాల్వ, పెనుమల్లం, గుడిమల్లం తదితర గ్రామాలతో పాటు రేణిగుంట మండల పరిధిలోని మరికొన్ని పల్లెల మీదుగా ప్రవహించే నక్కలవంక వాగులో నీరు కలుషితం అవుతోంది. గాజులమండ్యం పారిశ్రామికవాడ నుంచి వచ్చే వ్యర్థనీరు కలుస్తుండడంతో నీరు కలుషితమవుతోంది.
ఏటా పడిపోతున్న
భూగర్భ జల నీటిమట్టం
సంవత్సరం నీటి మట్టం
(మీటర్లు)
2005 6.58
2006 9.91
2007 9.90
2008 8.26
2009 11.45
2010 8.79
2011 10.11
2012 15.77
2013 17.88 (ఆగస్టు నాటికి)