ఆడవారి కష్టం తెలిసిన ఓ మగాడు...
చూసిన అతడు... మొత్తం మహిళా జాతికే ఆ ఇబ్బంది నుంచి విముక్తి కలిగించాలనుకున్నాడు, కలిగించాడు. నిజాయతీ, నిబద్ధతలతో కూడిన ప్రయత్నం ఎప్పుడూ గొప్ప ఫలితాలనే ఇస్తుంది అన్నది ఎంత నిజమో అతణ్ణి చూస్తే తెలుస్తుంది.
పెళ్లైన కొత్తలో ఓ రోజు... పాత బట్టల కోసం వెతుకుతున్న భార్యను చూశాడు అరుణాచలం. వాటితో పనేంటని అడిగాడు. నెలసరి సమయంలో అవి అవసరం అని చెప్పిందామె. ‘పాత గుడ్డలు వాడతావా’ అన్నాడు ఆశ్చర్యపోతూ. ‘ఏం చేస్తాం, మాకివే అలవాటు, పల్లెటూరివాళ్లకి, పేద మహిళలకి శానిటరీ నేప్కిన్స్ కొనే స్థోమత ఉండదుగా’ అందామె అతడి మాటను తేలికగా తీసేస్తూ. కానీ అరుణాచలం మాత్రం భార్య మాటల్ని తేలికగా తీసుకోలేదు. వారి కష్టాన్ని ఆరా తీశాడు. వారు పడే ఇబ్బందిని అంచనా వేశాడు. వారి సమస్యను తీర్చాలనుకున్నాడు
ఆలోచన తేలిగ్గానే వచ్చింది. కానీ ఆచరణ అంత సులభం కాదు కదా! కానీ ఎంత కష్టమైనా వెనకడుగు వేయలేదతడు. శానిటరీ నేప్కిన్స్ మీద రీసెర్చ్ చేశాడు. ఎలా తయారవుతాయి, ఏమేం వాడతారు, ఎంత ఖర్చవుతుంది, ఎంత రేటు పలుకుతున్నాయి... ఇలా అన్నీ తెలుసుకున్నాడు. తయారీ ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల నేప్కిన్స్ ధర ఎక్కువ ఉంటోందని అర్థమైంది. నేప్కిన్స్ తయారు చేసే యంత్రమే కోటిన్నర రూపాయలుండడం చూసిన తరువాత... ముందు అతి తక్కువ ఖర్చుతో ఓ యంత్రాన్ని తయారు చేయాలనుకున్నాడు. కేవలం లక్షన్నరతో ఓ యంత్రాన్ని కనిపెట్టాడు.
ఇక మిగిలింది... తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు చేసే నాప్కిన్ తయారు చేయడమే.
ఏం చేయాలన్నా ముందు నేప్కిన్స్ వాడకం గురించి, లాభనష్టాల గురించి తెలుసుకోవాలి. కానీ ఎలా? దాని గురించి మాట్లాడదామంటే భార్యే సిగ్గుపడుతోందాయె. దాంతో మెడికల్ కాలేజీలకు వెళ్లి, వైద్య విద్యార్థినులతో చర్చలు జరపడం మొదలెట్టాడు. స్పష్టత వచ్చింది. ఏం చేస్తే తక్కువ ఖర్చుతో నేప్కిన్ తయారవుతుందో అర్థమైంది. వెదురు, పేపర్, దూది వంటి వాటితో ప్రయోగాలు చేశాడు, ఫలితం సాధించాడు. అయితే అది ఎలా పని చేస్తుందో తెలుసుకోవడం పెద్ద పని అయిందతడికి. ఎవరినీ అడగలేడు. చివరికి భార్య కూడా సహకరించలేదు. దాంతో జంతువు రక్తంతో ప్రయోగాలు చేశాడు. తన ప్రయత్నం ఫలించిందని అర్థం చేసుకున్నాడు. కానీ అది సాధించేలోపే అతడికి పిచ్చివాడిగా ముద్ర వేశారు కొందరు. భార్య కూడా అపార్థం చేసుకుని వెళ్లిపోయింది. విడాకుల నోటీసు కూడా పంపింది. కానీ అరుణాచలం మనసు మార్చుకోలేదు. లక్ష్యం మీదే దృష్టిపెట్టాడు.
తొలి విడతగా ఓ వెయ్యి నాప్కిన్స్ తయారుచేశాడు అరుణాచలం. వాటిని ప్యాక్ చేసి, బ్యాగులో పెట్టుకుని బయలుదేరాడు. పేద మహిళల దగ్గరికెళ్లి శానిటరీ నేప్కిన్స్ వాడాల్సిన అవసరంతో పాటు తన నేప్కిన్స్ లాభాలను కూడా వివరించాడు. మారుమూల గ్రామాల్లోని మహిళలకు సైతం వాటిని అందుబాటులోకి తెచ్చాడు. అంతటితో ఆగిపోలేదు. తాను కనిపెట్టిన యంత్రాన్ని పెద్ద మొత్తంలో తయారుచేసేందుకు ‘జయశ్రీ ఇండస్ట్రీస్’ని స్థాపించాడు. వెనుకబడిన మహిళలను కూడగట్టాడు. యంత్రాలు తక్కువ ధరకే ఇస్తాను. మీరే నేప్కిన్స్ తయారుచేసి జీవనభృతిని పొందండి అన్నాడు. వాటిని కొనే స్థోమత కూడా లేనివారికి బ్యాంకు ఋణాలు ఇప్పించాడు. ఓ పక్క వారికి మేలు చేస్తూనే ఇంకోపక్క ఆర్థిక స్వావలంబన చేకూర్చాడు.
అప్పటికి అతడికి మనసు అందరికీ అర్థమయింది. వదిలి వెళ్లిపోయిన భార్య సైతం తిరిగి వచ్చింది. ‘‘రుతుక్రమం మహిళలకు సహజమైనది. కానీ అది వాళ్లకు నరకంగా మారకూడదు. మన దేశంలో కేవలం రెండు శాతం మంది మహిళలే నేప్కిన్స్ వాడుతున్నారు. నూటికి నూరుశాతం అందరూ వాడేలా చేయాలి’’ అంటాడు అరుణాచలం. కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, శయనేషు రంభగా జీవితాన్ని ధారపోసే స్త్రీ జాతి రుణం తీర్చుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నానంటారు అరుణాచలం. మరి మీ సంగతేంటి!