రాజకీయాల్లో ఇంటిపేర్లకు కాలం చెల్లింది: జైట్లీ
రాజకీయాల్లో ఇంటిపేర్లకు కాలం చెల్లింది: జైట్లీ
న్యూఢిల్లీ: త్వరలో రాజకీయాల్లో ఇంటిపేర్లు, వంశచరిత్రకు తెరపడుతుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలకు చురకలంటించారు. ఇప్పటికే ఈ సంప్రదాయం ప్రపంచ వాణిజ్యరంగంలో ఆరంభమైందన్నారు. భారత చరిత్రలో 1991 ముఖ్యమైన టర్నింగ్‌పాయింట్ అని చెబుతూ, ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక రంగం అంతకు మునుపెన్నడూ లేనటువంటి దురవస్థను చవిచూసిందని, సత్తా ఉన్నోడే మనుగడ సాగిస్తాడు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికే పట్టం కడతారన్నది రుజువైందని అన్నారు.
ఆదివారమిక్కడ నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి జైట్లీ మాట్లాడారు. ఇంటిపేరు, కుటుంబాలు, వంశచరిత్రలాంటి వాటితో పనిలేదని సత్తా ఉన్నోడే మనుగడ సాగిస్తాడనే సూత్రం ప్రస్తుతం న్యాయ, వ్యాపార రంగాలకు బాగా వర్తిస్తుందన్నారు.