సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 29న హైదరాబాద్ నగరానికి రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. భారత్ బయోటెక్‌లో తయారవుతున్న తొలి భారతీయ కరోనా వ్యాక్సిన్ పురోగతిని ఆయన పరిశీలిస్తారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి హకీంపేట్‌కు ప్రత్యేక విమానంలో మోదీ నగరానికి చేరుకుంటారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో టీకా పంపిణీపై కసరత్తు చేస్తున్న ప్రధాని నవంబర్ 28వ తేదీన పుణె నగరానికి వెళ్ళనున్నారు. అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌పై ప్రధాని సమీక్ష జరపనున్నారు. టీకా ఉత్పత్తి పంపిణీ తయారీని సమీక్ష నిమిత్తం ప్రధాని ఈ నెల 28న పుణేలోని సీరంను సందర్శిస్తారని పూణే డివిజనల్ కమిషనర్ సౌరభ్ రావు వెల్లడించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని భారత్ బయోటక్ సంస్థను కూడా ప్రధాని సందర్శించనున్నట్టు సమాచారం.
కాగా గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వంలో బీజేపీ, అధికార టీఆర్‌ఎస్ మధ్య రగులుతున్న మాటల మంటల మధ్య ప్రధాని మోదీ రాక ప్రాధన్యతను సంతరించుకుంది. అదీ ప్రచారం ముగియడానికి కేవలం 50 నిమిషాల ముందు హైదరాబాద్ చేరుకోనున్నారనే అంచనా మరింత ఉత్కంఠ రేపుతోంది. అటు అవసరమైతే ప్రధానమంత్రి మోదీని జీహెచ్ఎంసీ ప్రచారానికి పిలుచుకొస్తారంటూ తెలంగాణ మునిసిపల్ మంత్రి కేటీఆర్ సెటైర్ వేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి ఏర్పడింది. అయితే, మోదీ పర్యటనకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఏ మాత్రం సంబంధం లేదనే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment