ఆదిలాబాద్: జాతీయ రహదారికి కూతవేటు దూరాన భోరజ్ సమీపంలో ఉన్న వైన్స్ షాపులో శనివారం రాత్రి జరిగిన చోరీలో కొత్త కోణం బయటపడింది. దాదాపు 26 పెట్టెల మద్యం, రూ.70 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆధారాలు సేకరించి ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. అయితే నిర్వాహకులు చెప్పిన సొమ్ముకు, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన సొమ్ముకు పొత్తన లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. మద్యం, డబ్బులు మొత్తం కలిపి రూ.3 లక్షల వరకు చోరీకి గురైనట్లు నిర్వాహకులు చెప్పారు. రూ.70 వేలు మాత్రమే చోరీకి గురైనట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. కాగా, చోరీ సొత్తుపై స్పష్టత కొరవడింది.
ఎందుకీ తేడా?
వైన్స్‌షాపులో చోరీని గుర్తించి నిర్వాహకులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రూ.2.30 లక్షల విలువ చేసే మద్యం, రూ.70 వేల నగదును ఇద్దరు దుండగులు ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. పోలీసులకు అనుమానం వచ్చి వైన్స్ షాపును పరిశీలించారు. మద్యం, డబ్బులు మొత్తం కలిపి రూ.70 వేలు మాత్రమే చోరీకి గురైందని, నిర్వాహకులు అబద్దం చెబుతున్నారని అనధికారికంగా వెల్లడించారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చోరీకి గురైన సొమ్మును నిర్వాహకులు ఎక్కువగా చేసి చూపుతున్నారని కేసు నమోదు చేయడానికి వెనక ముందు చేశారు. చోరీ విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి. రూ.62 వేల విలువ చేసే మద్యంతోపాటు మరో రూ.8 వేల నగదు చోరీకి గురైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకులు మాత్రం రూ.3లక్షల వరకు చోరీ అయిందని చెప్పడం గమనార్హం.
ఏదీ నిజం ?
వైన్స్ నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నదానికి పొంతన లేకపోవడంతో అసలు ఏది నిజం అన్న ప్రశ్న తలెత్తుతోంది. చోరీ కేసుల్లో ప్రాపర్టీ రికవరీ చూపించడం అనే పోలీసుల ప్రాథమిక విధిగా ఉంటుంది. రూ.3 లక్షల వరకు సొత్తు చోరీ అయినట్లు ఎఫ్‌ఐఆర్ నమోద చేస్తే, అంత మొత్తం రికవరీ చూపించడం కష్టం ఉంటుందని పోలీసులే కావాలనే రూ.70 వేలు మాత్రమే అని నమోదు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరో వైపు నిర్వాహకుల నిజాయితీపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఊరికి బయట ఉన్న వైన్స్‌లో రాత్రి వేళ కౌంటర్‌లో రూ.70 వేల వరకు నగదు ఉంచాల్సిన అవసరం ఏం వచ్చింది? అంత డబ్బులు, మద్యం సీసాలతో నిండిన షాపులో కాపలాగా ఎవరిని ఎందుకు నియమించలేదు? రూ.3 లక్షలు చోరీకి గురైతే ఎఫ్‌ఐఆర్‌లో రూ. 70వేలు అని పోలీసులు రాస్తే, నిర్వాహకులు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నలకు సమాధానాలు లేవు.
అసలు సీసీ టీవీలో కనిపిస్తున్న ముసుగు దొంగలు ఎవరు? చోరీకి గురైన సొత్తు ఎంత? నిర్వాహకులు, పోలీసుల చెబుతున్నది ఎవరిది నిజం? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సీసీ టీవీల్లో రికార్డ్ అయిన దొంగలు దొరకాలి. ఈ విషయమై సీఐ కోల నరేశ్‌ను వివరణ కోరగా, కేసు నమోదు చేశామని, త్వరలో దర్యాప్తు పూర్తి చేసి, పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment