ఆదిలాబాద్: జీవితాంతం తోడుంటానని తనతో ఏడడుగులు నడిచిన భర్త కళ్లెదుటే రోడ్డు ప్రమాదంలో మరణించడాన్ని ఆయన భార్య జీర్ణించుకోలేక పోతోంది. దంపతులిద్దరూ కలిసి ప్రతిరోజు పనుల నిమిత్తం తమ గ్రామం మావల నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. ఓరగంటి నర్సయ్య (40) జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
అలాగే అతడి భార్య ప్రతిమ బస్టాండ్ ఎదుట కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. రోజు లాగే విధులు ముగించుకుని బస్టాండ్ ప్రాంతానికి కాలిబాటన నర్సయ్య రోడ్డుకు అటువైపు ఉన్న భార్యను తీసుకొని వెళ్లేందుకు రోడ్డు దాటే క్రమంలో ఓ యువకుడు బైక్‌పై అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై మృతిచెందాడు. ప్రమాదానికి కారకుడైన యువకుడు సంఘటనా స్థలం నుంచి బైక్‌తో పాటు పరారయ్యాడు.
బైక్ నంబర్‌తో చూడగా భుక్తాపూర్ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబం మరొకరి జీవితంలో వెలుగు నింపేలా నిర్ణయం తీసుకుంది. మృతిచెందిన నర్సయ్య కళ్లను ఇతరులకు దానం చేసి వారికి కొత్త జీవితం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు.
అసలేం జరిగిందంటే..
అటవీశాఖ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నర్సయ్యది పేద కుటుంబం. తండ్రి ఇదివరకే మరణించగా, వృద్ధురాలైన తల్లి సుభద్ర ఇంటివద్దే ఉంటుంది. నర్సయ్యకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అశ్విత పదో తరగతి చదువుతుండగా, రెండో కుమార్తె అంకిత 8వ, మూడో కుమార్తె ఆర్వి 5వ తరగతి చదువుతున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు భార్య ప్రతిమ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోంది.
ప్రతిరోజు వీరు ఉదయం మావల గ్రామం నుంచి ఆదిలాబాద్ పట్టణానికి వస్తారు. మళ్లీ సాయంత్రం ఇద్దరు కలిసి ఇంటికి పయనం అవుతారు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బస్టాండ్ ఎదుట రోడ్డు దాటుతున్న నర్సయ్యను ఢీకొట్టడంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు రాత్రి 10.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు తరలించారు. అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం అక్కడినుంచి మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆయన కళ్లను దానం చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ ఎస్సై డి.ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment