బెల్లంపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం
సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అంకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రాన్ని సరిగా పూర్తిచేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ)కు అప్పగించడం, విధి విధానాలను అనుసరించి వ్యవహరించడం, పలు అంశాలను తూచ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా ఎన్నికల అఫిడవిట్‌లో తమ ఆస్తులు, నేర చరిత్ర, కులం వంటి వివరాలను పక్కాగా నమోదు చేయాలి. ఇందులో ఏమాత్రం పొరపాటు జరిగినా వారి నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అఫిడవిట్‌లో వివరాలు తప్పుగా నమోదు చేసి ఎన్నికల్లో విజయం సాధించినా ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుచేత నామినేషన్ పత్రాల్లో సరైన వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని, నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.
ఆస్తుల వివరాలు అందించాల్సిందే..
ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమకున్న ఆస్తుల వివరాలను విధిగా నమోదు చేయాలి. స్థిర, చర ఆస్తులు, ఆభరణాలు, వాహనాల వివరాలు నిర్దిష్ట ప్రోఫార్మాలో నమోదు చేయాల్సి ఉంటుంది. వారికున్న రుణాలు, అప్పులు, ఐదేళ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలు సైతం అందించాలి.
కులం వివరాలు తప్పనిసరి!
అభ్యర్థులు తమ కులం వివరాలను అఫిడవిట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈసీ ప్రకటించిన రిజర్వేషన్ ప్రకారంగానే అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉండడంతో ఆ కులం వివరాలతో పాటు రెవెన్యూ అధికారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. జనరల్ స్థానాల్లో పోటీ చేసే వారికి ఈ నిబంధన వర్తించదు.
ఇవి చదవండి: నామినేషన్ ఘట్టానికి ఏర్పాట్లు! : చాహత్ బాజ్‌పాయ్
Comments
Please login to add a commentAdd a comment