వెన్నుపోటు నేతలకు భంగపాటు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు నేతలకు భంగపాటు

Published Sat, Mar 16 2024 1:20 AM | Last Updated on Sat, Mar 16 2024 7:29 AM

- - Sakshi

ఫిరాయింపుదారుల్ని కరివేపాకులా చూసిన చంద్రబాబు

డబ్బుకు ఆశపడి విలువలున్న పార్టీని వీడిన ఎమ్మెల్యేలు

పాడేరు సీటు ఆశించిన గిడ్డి ఈశ్వరికి మొండిచెయ్యి

రంపచోడవరం టికెట్‌ కోసం భంగపడ్డ వంతల రాజేశ్వరి

కిడారి శ్రవణ్‌ని వంచించిన చంద్రబాబు

రాజకీయ భవిష్యత్తు నాశనం చేశారంటూ వాపోతున్న ఫిరాయింపుదారులు

తదుపరి కార్యాచరణ కోసం అనుచరులతో మంతనాలు

చంద్రబాబు ఇంటి ముందే ఆందోళన చేసిన వంతల అనుచరులు

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌చంద్రబాబు అని తెలిసి కూడా..నాయకులుగా మలిచి.. చట్టసభలకు పంపించిన పార్టీని వెన్నుపోటు పొడిచి మరీ.. ఆయన పంచన చేరారు. తీరా.. వారి అవసరం లేదని అనుకున్న చంద్రబాబు.. కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు. విజ్ఞత కలిగిన పార్టీకి దూరమై.. విలువల్లేని పార్టీలో చేరి.. ఇప్పుడు వంచనకు గురయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు నేతలు వైఎస్సార్‌సీపీని వంచించి.. టీడీపీలో చేరి.. పాపాలు మూటకట్టుకున్నామంటూ అనుచరగణం ఎదుట బోరుమంటున్నారు.

సాక్షి, విశాఖపట్నం : ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేస్తూ.. గెలిపించిన ప్రజల నమ్మకాన్ని.. ఆదరించిన పార్టీ విశ్వాసాన్ని అమ్ముకున్న ప్రజా ప్రతినిధులు.. ఇప్పుడు బేల చూపులు చూస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంతలో పశువుల్లా ఎమ్మెల్యేల్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొనేశారు. ఒడ్డు దాటే వరకే ఓడ మల్లన్న.. ఆ తర్వాత బోడి మల్లన్న అనే సూత్రాన్ని ప్రతిసారీ తూచ తప్పకుండా పాటించే నాయకుడు చంద్రబాబే అన్న విషయం జగమెరిగిన సత్యం. అది తెలిసి కూడా.. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తల్లిలా ఆదరించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వదిలేసి.. టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడా టీడీపీ.. టికెట్‌ ఇవ్వకుండా బలిపశువుల్ని చేయడంతో రోడ్డున పడ్డారు. ఫిరాయింపుదారుల రాజకీయ పరిస్థితి గాల్లో దీపాల్లా మారిపోయాయి.

‘కిడారి’ సీటుకు కిరికిరి..!
రూ.కోట్లు.. మైనింగ్‌ లైసెన్సుల ఆశ చూపి.. మరో గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేగా ముద్రవేసేశారు చంద్రబాబు. 2014లో వైఎస్‌ జగన్‌ నమ్మి అరకు టికెట్‌ని ఇస్తే.. వైఎస్సార్‌సీపీ దయతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. బాకై ్సట్‌ మైనింగ్‌ లైసెన్సుల కోసం ఆశపడుతున్నట్లు గ్రహించిన టీడీపీ.. కిడారికి.. అదే ఎర వేసేసింది. రూ.12 కోట్లు.. మైనింగ్‌ లైసెన్స్‌ ఇస్తామని లోకేష్‌ చెప్పడంతో.. జంప్‌ అయ్యారు. ఈ విషయాలన్నీ.. మావోయిస్టుల ఎదురుగా.. స్వయంగా కిడారి చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు అప్పట్లో చెప్పడం కలకలం రేపాయి.

మావోయిస్టుల చేతిలో కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురైన తర్వాత.. ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌ కుమార్‌ని ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా కనీసం అవకాశం ఇవ్వకుండానే ఆగమేఘాలపై చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సరిగ్గా ఆరు నెలల తర్వాత లోకేష్‌ కోసం మంత్రి పదవుల సర్దుబాటులో భాగంగా కిడారి శ్రావణ్‌తో మంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయించేశారు. ఆ తర్వాత 2019లో టీడీపీ తరఫున పోటీ చేసినా.. పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా, పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జీగా ఐదేళ్లుగా టీడీపీని అరకులో నిలబెట్టారు. అలాంటి కిడారిని కూడా కరివేపాకులా తీసిపారేయడంతో ఈ యువనాయకుడికి దిక్కుతోచని పరిస్థితి. అధినేతతో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో భవిష్యత్తు కార్యచరణపై అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

నైరాశ్యంలో ‘వంతల’
గిడ్డి, కిడారి బాటలో చంద్రబాబుని నమ్మి మోసపోయిన జాబితాలో వంతల రాజేశ్వరి కూడా చేరారు. రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించారు. టీడీపీ ఆకర్ష్‌లో భాగంగా.. తాను పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామని ఆఫర్‌ చేశారంటూ 2016 మార్చిలో సంచలన వ్యాఖ్యలను బహిరంగంగా చేసిన వంతల.. ఏడాది కాలంలోనే వైఎస్సార్‌సీపీని వీడి.. డబ్బు ఆశ చూపిన పచ్చ కండువానే కప్పుకున్నారు. చట్టసభలకు పంపించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే చివరి వరకూ నా రాజకీయ ప్రయాణమని చెప్పి.. ప్రలోభాల ఎరలో చిక్కుకొని టీడీపీలోకి జంప్‌ అయ్యారు.

2019లో టీడీపీ తరఫున పోటీ చేసినా.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వంతలను ఇంటిలోనే కూర్చోబెట్టారు. ఆ తర్వాత నియోజకవర్గంలో టీడీపీని బతికించేందుకు వ్యయప్రయాసలతో ఐదేళ్లు పనిచేసినా.. చంద్రబాబు గుర్తించకుండా.. వంతల సేవలకు స్వస్తి చెప్పారు. టికెట్‌ రాకపోవడంతో రాజేశ్వరి నైరాశ్యంలో కూరుకుపోయారు. పార్టీ కోసం సేవచేసినా.. మిరియాల శిరీషకు టికెట్‌ రావడంతో చంద్రబాబు తనకు కూడా వెన్నుపోటు పొడిచేశారంటూ సన్నిహితుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.

ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకోకుంటే..
ముగ్గురు ఫిరాయింపుదారులకూ టీడీపీ చెక్‌ పెట్టింది. వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచిన వారందరికీ.. చంద్రబాబు మళ్లీ వెన్నుపోటు పొడిచారంటూ ప్రజలే మాట్లాడుకోవడం విశేషం. రాజకీయాల్లో ఉన్న వారు.. పదవులు కోల్పోయినా.. ఇప్పుడు కాకపోతే మరోసారైనా విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. సానుభూతిని.. ప్రజలలో విశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా చూసుకోవాలి. ఈ విషయంలో మాత్రం వైఎస్సార్‌సీపీని కాదని టీడీపీకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు చంద్రబాబుని నమ్మి పూర్తిగా నష్టపోవడంతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని కూడా కోల్పోయారు. ఈ ఎన్నికల్లో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే వీరి రాజకీయ భవిష్యత్తుకు చరమగీతం పాడినట్లే అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పాలుపోని ఈశ్వరి..
2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి.. ఎమ్మెల్యేగా విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి.. తర్వాత చంద్రబాబు మాయమాటలతో పార్టీ ఫిరాయించేశారు. రూ.5 కోట్ల డీల్‌ తోపాటు మంత్రి పదవి ఇస్తానని చెప్పి.. చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించడంతో.. అన్నలా ఆదరించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాదని.. నయవంచకుడి పంచన చేరి.. 2018లో పచ్చ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి గిడ్డికి అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. టీడీపీలో సరైన ప్రాధాన్యమివ్వడం తగ్గించేశారు. 2019 టీడీపీ నుంచి కష్టపడి టికెట్‌ సాధించి పోటీలో నిలిచారు.

వైఎస్సార్‌సీపీకి అన్యాయం చేసిన గిడ్డి ఈశ్వరిపై విశ్వాసం కోల్పోయిన ప్రజలు.. ఆమెని ఇంటికే పరిమితం చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఈశ్వరిని పొమ్మనకుండా పొగపెట్టే ప్రయత్నాలు చేస్తూ.. పొత్తుల్లో భాగంగా టికెట్‌ని బీజేపీకి కట్టబెట్టేశారు. దీంతో.. గిడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తన గోడు వినిపించేందుకు వెళ్దామని అనుకున్నా.. చంద్రబాబు రానివ్వడం లేదని తెలుస్తోంది. దీంతో.. గిడ్డి అనుచరులు మండిపడుతున్నారు. రెబల్‌గా పోటీ చేయాలని పార్టీ శ్రేణులు చెబుతున్నా.. ఏం చెయ్యాలో పాలుపోక నడిసంద్రంలో నిలిచిపోయినట్లు తన పరిస్థితి ఉందని సన్నిహితుల వద్ద వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement