రంపచోడవరం: నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి తలోదారి అన్నట్టుగా ఉంది. గ్రూపు రాజకీయాల కారణంగా ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఈ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీకి కంచుకోట. ఇక్కడ గత రెండు దఫాలుగా ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున విజయం సాధించిన వంతల రాజేశ్వరి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. ఆమైపె వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి 39 వేల భారీ మెజారిటీ విజయం సాధించారు.
ఎవరికివారే అన్నచందంగా..
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కడుతున్నారు. దీంతో సహజంగానే టీడీపీ శ్రేణుల్లో నిర్లిప్తత నెలకొంది. ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా ఆ పార్టీ నేతల పరిస్థితి ఉంది. అసెంబ్లీ సీటు కోసం పోటీపడుతున్న నాయకుల్లో ఎవరికి టికెట్ దక్కినా మిగతా వారు సహకరించే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్, వంతల రాజేశ్వరితోపాటు గొర్లె సునీత, మిరియాల శిరీష, సున్నం వెంకటరమణ, గొర్లె శ్రీకాంత్ గ్రూపులుగా విడిపోవడంతో టీడీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.
మరోపక్క పొత్తులో భాగంగా ఈ సీటును తమకు కేటాయించాలని జనసేన నాయకులు కోరుతున్నారు. ఇందులో భాగంగానే ఆ పార్టీకి చెందిన కుర్ల రాజశేఖరరెడ్డి, కాకి స్వామి, చారపు రాయుడు ముఖ్య నాయకులను కలిసి తమ ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన టీడీపీ శ్రేణులు జనసేనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
మరోపక్క ఓ మాజీ ఎంపీ కూడా టీడీపీలో చక్రం తిప్పుతున్నారు. అసంతృప్తి వాదులందరినీ ఆమె కూడగట్టడంతో పార్టీ శ్రేణుల పరిస్థితి తలోదారి అన్నట్టుగా ఉంది. ఇక వైఎస్సార్‌సీపీ విషయానికి వస్తే గ్రామస్థాయిలో పటిష్టంగా ఉంది. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment