స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు సిగ్గుచేటు
పాడేరు : గిరిజనులకు జీవనాడిగా ఉన్న 1/70 చట్టాన్ని తుంగలోకి తొక్కేలా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా చలి ఉత్సవాలను తమ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. దీనిపై గురువారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగంతో కలిసి చర్చించారు. గిరిజన ప్రాంతంలో ప్రజలు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే వాటిని పరిష్కారించాల్సిందిపోయి ఏం సాధించారని అరకు చలి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల కోసం రాజ్యంగంలో పొందుపర్చిన హక్కులు, చట్టాలు సక్రమంగా అమలు చేయకుండా ఎవరి కోసం అరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. టూరిజం, గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్య లు చేయడంతో గిరిజనులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. గిరిజనుల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో అరకు ఉత్సవాలు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. రూ.కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేసేందుకు అరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. 1/70 చట్టానికి తూట్లు పొడిచేలా మాట్లాడిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన అయ్యన్న పాత్రుడితో సహ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలకు గిరిజన ప్రాంతంలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా తాము ఉత్సవాలను అడ్డుకొని తీరుతామని పాడేరు ఎమ్మెల్యే స్పష్టంచేశారు.
ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలి
లేకుంటే ఉత్సవాలను అడ్డుకుంటాం
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు
Comments
Please login to add a commentAdd a comment