విద్యార్థినులను దండించిన వారిపై చర్యలు తీసుకోవాలి
చింతపల్లి: చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులను దండించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏకలవ్య పాఠశాలప్రధాన ద్వారం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థి తండ్రి కిల్లో పూర్ణచంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులపై అమానుషంగా దాడి చేసిన అకౌంటెంట్, ముగ్గురు ఉపాధ్యాయులపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సంఘటన జరిగి సుమారు 15 రోజులు కావస్తున్నా విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారే తప్పితే బాధ్యులపై ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కలెక్టర్ దినేష్‌కుమార్, అధికారులు స్పందించి విద్యార్థులను దండించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమం విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, అదనపు ఎస్‌ఐ వెంకటరమణలు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్‌కుమార్ అమరావతి లోని అధికారులతో ఫోన్‌లో మాట్లాడి విషయాన్ని తెలియజేశారు. రెండు రోజుల్లో సంఘటన బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామన్నారని తెలియజేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment