ఇది కూటమి..
ప్రకృతి వైపరీత్యం వారిపాలిట శాపంగా మారితే కూటమి సర్కార్ వైపరీత్యం మరింత కుంగదీసింది.. కొండచరియలు విరిగిపడడంతో ఇళ్లు కోల్పోయి ఐదు నెలలైనా చట్రాపల్లి బాధితుల వైపు అధికారులుగాని, కూటమి ప్రజాప్రతినిధులుగాని కన్నెత్తి చూడడం లేదు.. దీంతో చేసేది లేక గుడిసెల్లో దుర్భరజీవనం గడుపుతున్న బాధితులు స్వయంగా మట్టితో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.
మట్టిగోడలతో రేకుల ఇల్లు నిర్మించుకుంటున్న గెమ్మెలి శ్రీనివాసరావు
సాక్షి, పాడేరు: జిల్లాలో జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామాన్ని గత ఏడాది సెప్టెంబర్ 8వతేదీ అర్ధరాత్రి వరద ముంచెత్తింది. కొండ దిగువున ఉన్న ఈ గ్రామంపైకి కొండచరియలు,బురదతో కూడిన వరదనీరు దూసుకువచ్చి బీభత్సం సృష్టించాయి. ఆరు గిరిజన కుటుంబాల నివాసాలు కొట్టుకుపోయాయి.మరి కొంతమంది గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర విపత్తులో కొర్రా కుమారి అనే గిరిజన మహిళ బురదలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచింది.మరో ముగ్గురు గిరిజనులు తీవ్ర గాయాలకు గురయ్యారు. ఇంత విషాదాన్ని ఎదుర్కొన్న చట్రాపల్లి బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గృహాలు కోల్పోయిన ఆరు గిరిజన కుటుంబాలతో పాటు పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి మోడల్ కాలనీ మంజూరు చేస్తామని ఆ సమయంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్‌కుమార్ ప్రకటించారు.
ఐదు నెలలైనా కాలనీ ఊసేలేదు..
చట్రాపల్లి ఘటన జరిగి ఐదు నెలలైనా పాలకులు మోడల్‌కాలనీ నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. ఆరు కుటుంబాలతో పాటు మరిన్ని కుటుంబాల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఆ మాటే మరచిపోయింది. ఇంత వరకు ఒక్క బాధిత కుటుంబానికి కూడా పక్కా ఇంటి సౌక ర్యం కల్పించలేదు.అప్పట్లో అన్ని విధాల ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా చట్రాపల్లిని మరిచిపోయారు. పూర్తిగా ఇళ్లు కొట్టుకుపోయిన ఆరు కుటుంబాలకు రూ.10వేలు,పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.4వేల చొప్పున మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి చేతులు దులిపేసుకుంది. దీంతో బాధితులు గుడిసెల్లో దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు.
మట్టి గోడలతో సొంతంగా ఇళ్ల నిర్మాణం
కూటమి ప్రభుత్వం పక్కా ఇళ్లు,మోడల్ కాలనీని మంజూరు చేయకపోవడంతో ఇక చేసేదేమీ లేక బాధిత గిరిజనులు సొంతంగా మట్టిగోడలతో ఇళ్ల నిర్మాణాలను ఈవారంలోనే ప్రారంభించారు.ఈ గ్రామానికి చెందిన కొర్రా బలరామమూర్తి తన మెట్ట భూమిని ఉచితంగా తోటి గిరిజనులకు ఇవ్వడంతో వారంతా మట్టిగోడలతో రేకుల ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇంటిల్లపాదీ కష్టపడుతూ ఇల్లు నిర్మించుకుంటున్నారు. గ్రామంలో మట్టి కూడా అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతం నుంచి ట్రాక్టర్ మట్టిని రూ.700 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వర్షం కాలానికి ముందే మట్టిగోడలతో గూడు నిర్మాణం పూర్తి చేసేం లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను విస్మరించడం అన్యాయమని గిరిజనులు వాపోతున్నారు. రెండు సార్లు మా గ్రామానికి వచ్చిన కలెక్టర్ కూడా తమకు న్యాయం చేయలేదని బాధిత గిరిజనులు వాపోతున్నారు.
ఇది కూటమి..
Comments
Please login to add a commentAdd a comment