నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు
చింతూరు: పోలవరం ముంపు బారిన పడుతున్న అర్హులైన ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చింతూరు ఐటీడీఏ పీవో, ఆర్‌అండ్‌ఆర్ అధికారి అపూర్వభరత్ అన్నారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 41.15 కాంటూరు పరిధి ఫేజ్–1బిలో ఉన్న 32 గ్రామాలకు సంబంధించిన భూసేకరణ, ఆర్‌అడ్‌ఆర్ ప్రక్రియపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఎస్‌ఈఎస్ సర్వేద్వారా ఇప్పటికే చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో 13,790 కుటుంబాలను గుర్తించినట్టు చెప్పారు. గతంలో చేసిన సర్వేలో జరిగిన పొరపాట్లను గుర్తించి తిరిగి మొత్తం నిర్వాసితుల డేటాను ప్రదర్శించాలని ఆదేశించారు. పరిహారం, పునరావాసం విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా గ్రామసభలు నిర్వహించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. వాయిదా పడిన గ్రామసభలను ఈనెల రెండు లేదా మూడో వారంలో నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్టు పీవో తెలిపారు. 41.15 కాంటూరు పరిధి ఫేజ్–1ఎ కు సంబంధించిన 22 గ్రామాలను వచ్చే వరదల నాటికి కాలనీలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఈలోపుగా కాలనీల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పీవో ఆదేశించారు. ఆయా గ్రామాల నిర్వాసితులకు సంబంధించిన ఆధార్, రేషన్, పింఛన్లు, ఉపాధి జాబ్‌కార్డులు మార్పు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సంబంధిత ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు వరద ముంపునకు గురవుతున్న కొన్ని గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదనలను పోలవరం అడ్మినిస్ట్రేటివ్ అధికారికి పంపి వాటిని ముంపు జాబితాలో చేర్చి పరిహారం, పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. భూమికి భూమి ఇచ్చేందుకు, కాలనీల నిర్మాణాలకు కావాల్సిన స్థలాన్ని ఎటపాక మండలంలో త్వరితగతిన గుర్తించాలని, గతంలో ముంపునకు గురికాని 28 గ్రామాల్లో భూమిని గుర్తించడం జరిగిందని చెప్పారు. త్వరలో నిర్వహించబోయే గ్రామసభల షెడ్యూల్‌ను వెంటనే తయారు చేయాలని పీవో ఆదేశించారు.
ఐటీడీఏ పీవో అపూర్వభరత్
Comments
Please login to add a commentAdd a comment