కాఫీ సాగు విస్తరణకు చర్యలు
పాడేరు : గిరిజనులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ పంటను మరింత విస్తరించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఎంజీ దినేష్ తెలిపారు. కేంద్ర కాఫీ బోర్డు బృందం శుక్రవారం పాడేరులో పర్యటించింది. స్థానిక మోదకొండమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఆలయ కమిటీ ప్రతినిధులు కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ దినేష్, సభ్యులకు అమ్మవారి చిత్రపటాలు అందజేసి దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దినేష్ మాట్లాడుతూ పాడేరు ఏజెన్సీలో ఐటీడీఏ, జీసీసీ, స్వచ్ఛంద సంస్థల ద్వారా గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ పంటను విస్తరించేందుకు, గిరిజనులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందజేసేందుకు , కాఫీ పల్పింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్‌లను కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్, సభ్యులు కలిసి, కాఫీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పాడేరు మండలం గెడ్డంపుట్టు గ్రామంలో మన్య తోరణ రైతు ఉత్పత్తుదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాఫీ పొడి యూనిట్‌ను సందర్శించారు.ఈ కార్యక్రమంలో పాడేరు ఏజెన్సీకి చెందిన కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు కురుసా మహేశ్వరరావు, జైతీ ప్రభాకర్, తాంగుల విశ్వనాథం సహా 15 మంది సభ్యులు పాల్గొన్నారు.
కేంద్ర కాఫీ బోర్డు చైర్మన్ దినేష్
Comments
Please login to add a commentAdd a comment