శ్రమదానంతో తాత్కాలిక రహదారి నిర్మాణం
ముంచంగిపుట్టు: రహదారి సమస్య నిత్యం వేధిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో డోలీమోతలే దిక్కుగా మారాయి. డోలీలో తరలిస్తుండగా మార్గమధ్యలోనే రోగులు మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. రహదారి నిర్మాణానికి ప్రభుత్వం,అధికారులు చొరవ చూపుతారని నమ్మకం పోయింది.దీంతో మండలంలోని మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన గిరిజనులు గ్రామానికి రహదారి నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. బంగారం, భూములు,మేకలు,కోళ్లు,పాలిచే ఆవులు అన్నింటినీ అమ్మి రూ.10లక్షలు సమకూర్చుకుని, పొక్లెయిన్ యజమానితో ఒప్పందం కుదుర్చుకుని కొంత మేర కొండల మార్గంలో రహదారిని నిర్మాణం చేశారు. శ్రమదానంతో ద్విచక్రవాహనాలు వచ్చే విధంగా దొరగూడ నుంచి ఉబ్బెంగుల గ్రామం వరకు 8కిలో మీటర్ల మట్టి రోడ్డును మూడు నెలల పాటు శ్రమించి నిర్మించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు లక్ష్మణ్,లైకోన్,కాడి,బుద్ర,గస్సు,మంగ్లీలు మాట్లాడుతూ సరైన రహదారి లేక ఎన్నో ఏళ్ల నుంచి రవాణా కష్టాలు పడుతున్నామని చెప్పారు. గ్రామంలో 20కుటుంబాలకు చెందిన 75మందికి పైగా గిరిజనులం జీవిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రి తరలించాలన్న,నిత్యావసర సరకులు తీసుకురావాలన్న అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు జిల్లా,మండల స్థాయి అధికారులను కలిసి రహ దారి సమస్యను తెలిపినా స్పందించలేదని వాపోయారు. దీంతో ఇంటిలో ఉన్న బంగారం,మేకలు,ఆవులు,భూములు అమ్ముకొని రూ. 10 లక్షతో పొక్లెయిన్ ఏర్పాటు చేసి, కొంత మేర పనులు చేయించామని చెప్పారు. శ్రమదానంతో తీవ్రంగా కష్టపడి మరికొంత మేర తాత్కాలిక రహదారిని నిర్మించుకున్నామని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన రహదారి మంజూరు చేసి రవాణా కష్టాలు తీర్చాలని వారు కోరారు.
మూడు నెలలు కష్టపడి..
8కిలో మీటర్ల రహదారి పూర్తి
ప్రభుత్వం స్పందించి, పక్కారోడ్డు
మంజూరు చేయాలని గిరిజనుల
విజ్ఞప్తి
శ్రమదానంతో తాత్కాలిక రహదారి నిర్మాణం
Comments
Please login to add a commentAdd a comment